Nirmala Sitharaman : 2024-25 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సభలో మాట్లాడిన వారితో పాటు బడ్జెట్ పట్ల ఆసక్తి కనబరిచిన సభ్యులందరికీ కేంద్ర ఆర్దిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తెలిపారు. బడ్జెట్లో లోక్‌సభలో జరిగిన చర్చకు మంగళవారం ఆమె బదులిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో ఈ ప్రభుత్వానికి వరుసగా మూడోసారి అధికారం కట్టబెట్టిన దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.
ప్రజలు తమ ప్రభుత్వంపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలుపుకుంటామని, నిలకడైన వృద్ధి రేటుతో ప్రజలే కేంద్రంగా విధానాలకు రూపకల్పన చేస్తామని తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా మనమంతా కలిసి పనిచేద్దామని నిర్మలా సీతారామన్ పిలుపు ఇచ్చారు. తాము ద్రవ్యలోటు కట్టడి లక్ష్యానికి అనుగుణంగా సాగుతున్నామని, 2025-26 నాటికి దాన్ని 4.5 శాతం దిగువకు తీసుకువస్తామని చెప్పారు.
బీజేపీయేతర పాలిత రాష్ట్రాలను బడ్జెట్లో కేంద్రం విస్మరించిందనే ఆరోపణలపై నిర్మలా సీతారామన్ స్పందించారు. బడ్జెట్ ప్రసంగంలో ఓ రాష్ట్రం పేరు ప్రస్తావించలేదంటే ఆ రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని అర్ధం కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో విపక్షాలు తప్పుడు ప్రచారం సాగిస్తున్నాయని మండిపడ్డారు. గత ఏడాదితో పోలిస్తే ఏ రంగానికీ ప్రస్తుత బడ్జెట్లో తక్కువ కేటాయింపులు లేవని చెప్పారు. కొవిడ్ అనంతరం మన ఎకానమీ వేగంగా ఎదుగుతున్నదని మంత్రి పేర్కొన్నారు.
Read More :
Tirumala | ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు శ్రీవారి పుష్కరిణి మూసివేత