న్యూఢిల్లీ: బీహార్, ఏపీలకే కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారన్న ప్రతిపక్షాల ఆరోపణల్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. బడ్జెట్ ప్రసంగంలో రాష్ర్టాల పేరు లేనంత మాత్రాన, ఆ రాష్ర్టానికి నిధులు ఇవ్వట్లేదనటం సరికాదని, ప్రతిపక్షాలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. మంగళవారం లోక్‌సభలో బడ్జెట్‌పై మాట్లాడుతూ 2024-25 బడ్జెట్లో అన్ని రాష్ర్టాలకూ నిధుల కేటాయించినట్టు చెప్పారు. ‘యూపీఏ హయాంలో 2009-10 బడ్జెట్లో 26 రాష్ర్టాల పేర్లు లేవు. ఆ రాష్ర్టాలకు నిధులు ఇవ్వలేదని అనుకోవచ్చా’ అని నిర్మల అన్నారు. మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ తన కుర్చీని కాపాడుకునేందుకు మిత్ర పక్షాలకు చెందిన ఓ రెండు రాష్ర్టాలకు బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించటం వివాదాస్పదమైంది.