Lightning strikes | బీహార్ (Bihar) లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల పిడుగులు (Lightning strikes) పడ్డాయి. ఈ పిడుగుల కారణంగా గడిచిన 24 గంటల్లో 9 మంది దుర్మరణం పాలయ్యారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. వాటిలో జహనాబాద్, మాదేపుర, ఈస్ట్చంపారన్, రోహ్తాస్, సరాన్, సుపౌల్ జిల్లాలు ఉన్నాయి.
జహనాబాద్ జిల్లాలో ముగ్గురు, మాదేపుర జిల్లాలో ఇద్దరు, ఈస్ట్ చంపారన్, రోహ్తాస్, సరాన్, సుపౌల్ జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున పిడుగుపాట్లకు బలయ్యారు. ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు ప్రకటించారు. ప్రజలు విపత్తు నిర్వహణ విభాగం అధికారుల సూచనలు పాటించాలని సీఎం సూచించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.