న్యూఢిల్లీ: కేరళకు చెందిన నర్స్ నిమిష ప్రియకు ఈ నెల 16న యెమెన్ ప్రభుత్వం ఉరి శిక్షను అమలు చేయబోతున్నది. ఆమె యెమెన్ జాతీయుడిని హత్య చేసినట్లు నిర్ధారించి, ఆమెకు కోర్టు మరణ శిక్ష విధించింది. అప్పటి నుంచి ఆమె కుటుంబ సభ్యులతోనూ, యెమెన్ అధికారులతోనూ నిత్యం సంప్రదిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.
సాధ్యమైన అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నట్లు పేర్కొంది. 2008లో యెమెన్‌కు వెళ్లిన నిమిష పలు దవాఖానల్లో పని చేసి, స్వయంగా ఓ క్లినిక్‌ను 2014లో ఏర్పాటు చేశారు. యెమెన్ చట్టాల ప్రకారం స్థానికులు భాగస్వాములుగా ఉండటం తప్పనిసరి కావడంతో తలాల్ అబ్డో మహదిని భాగస్వామిగా చేర్చుకున్నారు. వీరిద్దరి మధ్య వివాదం ఏర్పడింది. అతనిని ఆమె హత్య చేసినట్లు 2018లో కోర్టు నిర్ధారించి, మరణశిక్ష విధించింది. ఈ శిక్షను యెమెన్ ప్రెసిడెంట్ నిరుడు ఆమోదించారు.