శనివారం 16 జనవరి 2021
National - Dec 22, 2020 , 16:49:08

బెంగళూరు అల్లర్ల కేసులో 17 మంది నిందితులు అరెస్ట్‌

బెంగళూరు అల్లర్ల కేసులో 17 మంది నిందితులు అరెస్ట్‌

బెంగళూరు:  గత ఏడాది ఆగస్ట్‌ నెలలో జరిగిన బెంగళూరు అల్లర్ల కేసులో 17 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్ట్‌ చేసింది. డీజే హల్లి, కేజీ హల్లి పోలీస్‌స్టేషన్‌లపై హింసాత్మక దాడులకు పాల్పడిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ), పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) కు చెందిన 17 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌ఏఏ తెలిపింది. ఈ కేసులో ఇప్పటివరకు 187 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. బెంగళూరు కేజీ హల్లి పోలీస్‌స్టేషన్‌లో గత ఏడాది ఆగస్ట్‌ 11 న పెద్ద ఎత్తున అల్లర్లు, హింసాత్మక దాడి జరిగింది. 

"ఎస్‌డీపీఐ నాయకులైన ఎండీపీ షరీఫ్, కేజీ హల్లి వార్డ్ అధ్యక్షుడు ఇమ్రాన్ అహ్మద్, ఇతర సీనియర్ నాయకులతో పాటు రుబా వకాస్, షబ్బార్ ఖాన్, షేక్ అజ్మల్ సమావేశాలు నిర్వహించినట్లు ఇప్పటివరకు దర్యాప్తులో తేలింది. ఆగస్ట్‌ 11న సాయంత్రం బెంగళూరులోని స్సాండ్రా, కేజీ హల్లి వార్డుల్లో వారు కుట్ర, కార్యకర్తల సమీకరణ, కేజీ హల్లి పోలీస్ స్టేషన్ వద్ద గుమిగూడి పోలీసులపై దాడి చేయడమే కాకుండా ప్రజలకు, పోలీస్ స్టేషన్ వాహనాలకు భారీ నష్టం కలిగించారు. అదేవిధంగా, నాగ్వారా వార్డు ఎస్‌డీపీఐ అధ్యక్షుడు అబ్బాస్, ఆయన సహచరులు అజిల్ పాషా, ఇర్ఫాన్ ఖాన్, అక్బర్ ఖాన్‌ల ద్వారా కేజీ హల్లి పోలీస్ స్టేషన్‌ వద్ద పెద్ద సంఖ్యలో జనాన్ని సమీకరించారు"అని ఎన్ఐఏ తెలిపింది.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ఛానెళ్లను "ప్రజల్లో బీభత్సం వ్యాప్తి చేయడానికి, కేజీ హల్లి పోలీస్ స్టేషన్‌పై దాడికి కార్యకర్తలను సమీకరించటానికిఉపయోగించారు" అని ఎన్‌ఐఏ ఇన్వెస్టిగేషన్ వెల్లడించింది. ఈ అల్లర్లలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 60 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. హింసకు సంబంధించి పోలీసులు 415 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.