Supriya Sule-Baramati | మహారాష్ట్రలోని బారామతి లోక్ సభా నియోజకవర్గం కేవలం రాష్ట్రానికి మాత్రమే కాక దేశ ప్రజలందరి ద్రుష్టిని ఆకర్షిస్తోంది. శరద్ పవార్ కుటుంబ సభ్యులే పరస్పరం ప్రత్యర్థులుగా ఉండటం దీనికి కారణం. ఒకవైపు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్) వర్గం నేత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీ చేస్తున్నారు. మరోవైపు శరద్ పవార్ కూతురు సుప్రియాసూలే ఎన్సీపీ( ఎస్పీ) గ్రూపు నుంచి పోటీలో ఉన్నారు.
అయితే సుప్రియా సూలేకు రెండు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి కేటాయించిన వాయిద్యం (బాకా) చిహ్నాన్ని పోలిన గుర్తును స్వతంత్ర అభ్యర్థికి ఎన్నికల సంఘం కేటాయించింది. మరోవైపు శరద్ పవార్ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఎన్సీపీ (ఎస్పీ) గుర్తును పోలి ఉండే బాకాను స్వతంత్ర అభ్యర్థి సొహైల్ షేక్‌కు కేటాయించడంతో ఓటర్లలో గందరగోళం నెలకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని విషయమై కేంద్ర ఎన్నికల సంఘం ముందు సుప్రియా సూలే ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత పేరు గల పుణె-బాగ్టోయ్ రిక్షావాలా అసోసియేషన్ నాయకుడు శరద్ పవార్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయనకు డిన్నర్ ప్లేట్ గుర్తు కేటాయించారు.