న్యూఢిల్లీ, మే 3: రోడ్లపై తరచూ ఏర్పడే గుంతలు, పగుళ్ల సమస్యలకు పరిష్కారంగా కొత్త సాంకేతికతను వినియోగించే అవకాశాలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) పరిశీలిస్తున్నది. ఈ సాంకేతికత ఉపయోగించి రోడ్లు వేస్తే.. రోడ్లకు పగుళ్లు, గుంతలు వచ్చినప్పుడు వాటికవే మరమ్మతు అవుతాయి. ఇందుకోసం స్టీల్ ఫైబర్, బిటుమెన్తో తయారుచేసిన కొత్త రకమైన తారును వినియోగించనున్నారు.
ఈ తారుతో వేసిన రోడ్లకు పగుళ్లు వచ్చినా, చిన్న చిన్న గుంతలు ఏర్పడినా వాటిల్లోకి తారు విస్తరించి పూడ్చేస్తుంది. రోడ్డు ప్రమాదాలకు ఎక్కువగా కారణమవుతున్న రోడ్లపై గుంతల సమస్యకు పరిష్కారంగా ఈ కొత్త సాంకేతికతపై దృష్టి సారించినట్టు ఎన్హెచ్ఏఐకు చెందిన ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. అయితే, ప్రస్తుతం ఇది పరిశీలన దశలోనే ఉంది. ఆర్థికంగా దీని వినియోగ సాధ్యాసాధ్యాలపై ఎన్హెచ్ఏఐ అధ్యయనం చేయనున్నది.