New Delhi : దేశరాజధాని ఢిల్లీ పరిధిలో ఒక నవ వధువు అనుమానాస్పదంగా మరణించింది. పెళ్లై మూడు నెలలు కూడా కాకముందే ఆ యువతి బిల్డింగ్ మూడో ఫ్లోర్ నుంచి కిందపడి మరణించింది. ఈ ఘటన ఢిల్లీలోని లోధి కాలని, ఎన్ఎండీసీ రెసిడెన్షియనల్ కాంప్లెక్స్, బి బ్లాక్ పరిధిలో శనివారం జరిగింది. అయితే, అత్తవారింటి వేధింపుల వల్లే ఆమె మరణించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకృతి అనే 28 ఏళ్ల మహిళకు గత ఏప్రిల్ 24న పెళ్లైంది.
అయితే, పెళ్లైనప్పటి నుంచి భర్త, అత్తవారింట్లో కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేసినట్లు ఆకృతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం వారి ఫ్లాట్స్‌లోని మూడో అంతస్తునుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిందని ఆకృతి అత్తామామలు అంటున్నారు. మూడో అంతస్తు నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలైన ఆకృతిని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని భర్త, అతడి కుటుంబ సభ్యులు అంటున్నారు. కానీ, వరకట్న వేధింపుల వల్లే ఆమె మరణించిందని ఆకృతి సోదరుడు ఆరోపించాడు. వారే ఆకృతిని హత్య చేశారని తెలిపారు. భర్త, అతడి కుటుంబం కలిసి ఆకృతిని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్తవారింటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భర్త కుటుంబం ఆకృతిపై గతంలో భౌతిక దాడి కూడా చేసిందని వివరించారు. నిబంధనలకు అనుగుణంగా అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఆకృతి బంధువులతోపాటు, ప్రత్యక్ష సాక్షులు అందరినీ విచారిస్తామన్నారు.