Newlywed bride | అదనపు కట్నం (dowry) కోసం అత్తింటి వేధింపులు తాళలేక నవ వధువు (Newlywed bride) బలవన్మరణానికి పాల్పడింది. భర్తతో సంతోషంగా గడపాల్సిన ఆమె.. పెళ్లైన రెండు నెలలకే తనువుచాలింది. ఈ ఘటన తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుప్పూర్ (Tiruppur)కు చెందిన వస్త్ర వ్యాపారి అన్నాదురై కుమార్తె రిధన్య (27)కు, కవిన్ కుమార్ (28) అనే యువకుడితో ఈ ఏడాది ఏప్రిల్లో వివాహం జరిగింది. వివాహ సమయంలో రిధన్య తల్లిదండ్రులు కట్నం కింద 100 సవర్ల (800 గ్రాములు) బంగారం, రూ.70 లక్షల విలువైన వోల్వో కారు (Volvo car)ను ఇచ్చారు. అయితే, పెళ్లై అత్తారింటికి వెళ్లిన రిధన్యకు అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి.
భర్త, అత్తమామలు.. రిధన్యను నిత్యం మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలు పెట్టారు. అత్తింటి వేధింపులు తాళలేక రిధన్య తనువు చాలించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం మొండిపాలయంలోని ఆలయానికి వెళ్తున్నానని చెప్పి కారులో బయల్దేరింది. మార్గం మధ్యలో ఓ చోట కారు ఆపి.. అందులోనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. కారు చాలాసేపు అక్కడ ఆగి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారులో రిధన్య మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు.
ఆత్మహత్యకు ముందు రిధన్య తన తండ్రికి వాట్సాప్లో ఏడు ఆడియో సందేశాలు పంపినట్లు గుర్తించారు. అందులో తన ఆవేదనను వెళ్లగక్కింది. వేధింపులను భరించలేకపోతున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది. ఈ మేరకు తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పింది. ‘నన్ను కవిన్కి ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్లు ముందే పథకం వేశారు. వాళ్లు పెట్టే మానసిక హింసను భరించలేకపోతున్నాను. ప్రతి ఒక్కరూ జీవితం అంటే అంతే.. సర్దుకుపోవాలనే చెబుతున్నారు. కానీ, నా బాధను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు.
నేను జీవితాంతం మీకు భారంగా ఉండాలనుకోవట్లేదు. నేను ఏ తప్పూ చేయలేదు. నాకు ఈ జీవితం నచ్చట్లేదు. అతను (భర్తను ఉద్దేశిస్తూ) నన్ను శారీరకంగా హింసిస్తుంటే.. అత్తమామలు మానసికంగా వేధిస్తున్నారు. ఇక నేను బతకలేను. నన్ను క్షమించండి నాన్నా’ అంటూ తన ఆవేదనను తండ్రికి తెలియజేసింది. రిధన్య మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తమ కుమార్తెకు న్యాయం చేయాలని ఆమె బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రిధన్య భర్త, అత్తమామలను అరెస్ట్ చేశారు. ఈ మేరకు వారిని విచారిస్తున్నారు.
Also Read..
Bangladesh | బంగ్లాదేశ్లో హిందూ మహిళపై అత్యాచారం.. స్థానిక రాజకీయ నేత అరెస్ట్
India-US | షరతులకు రెండు దేశాలూ ఓకే.. జులై 8 నాటికి భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ప్రకటన..!
Artificial Rain | ఢిల్లీలో కృత్రిమ వర్షానికి ఏర్పాట్లు.. ఎప్పుడు..? ఎందుకంటే..?