లక్నో: నిద్రిస్తున్న తల్లిదండ్రుల మధ్య నెల రోజుల శిశువు నలిగిపోయాడు. దీంతో ఊపిరాడక ఆ పసి బాలుడు మరణించాడు. (Newborn Crushed Between Parents) ఉదయం ఈ విషయం తెలుసుకుని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గజ్రౌలాకు చెందిన 25 ఏళ్ల సద్దాం అబ్బాసి, అస్మా భార్యాభర్తలు. నవంబర్ 10న అస్మా బాబుకు జన్మనిచ్చింది.
కాగా, డిసెంబర్ 6న శనివారం రాత్రి తొలి సంతానమైన కుమారుడు సూఫియాన్ను సద్దాం, అస్మా తమ మధ్యలో పడుకోబెట్టారు. అయితే నిద్రలో వారు అటూఇటూ కదలడంతో వారి మధ్య ఉన్న పసి బాలుడు నలిగిపోయాడు. ఊపిరాడకపోవడంతో మరణించాడు. ఆదివారం తెల్లవారుజామున అచేనతంగా ఉన్న కుమారుడ్ని చూసి తల్లి అస్మా ఆందోళన చెందింది. వెంటనే హాస్సిటల్కు తరలించగా ఆ శిశువు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో హాస్పిటల్ వద్ద ఆ దంపతులు గొడవపడ్డారు.
మరోవైపు పుట్టినప్పటి నుంచి శిశువు బలహీనంగా ఉండటంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు బంధువులు తెలిపారు. 26 రోజుల పసి బాలుడికి కామెర్ల వ్యాధి కూడా సోకినట్లు చెప్పారు.
కాగా, నవజాత శిశువులను విడిగా పడుకోబెట్టాలని డాక్టర్లు సూచించారు. తల్లిదండ్రుల మధ్య పడుకోబెడితే ప్రమాదవశాత్తు ఊపిరాడక చనిపోయే అవకాశాలు ఎక్కువని అన్నారు. శిశువు మరణం గురించి తమ దృష్టికి వచ్చినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అయితే ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.
Also Read:
Drunk Man Operate On Woman | యూట్యూబ్ చూసి.. మద్యం మత్తులో ఆపరేషన్ చేసిన వ్యక్తి, మహిళ మృతి