న్యూఢిల్లీ : విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో సమానత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. వివిధ రాష్ర్టాల్లో అధికారులు, ప్రతిపక్షాలు, అగ్ర వర్ణాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, బీజేపీ నేతలు ఈ నిబంధనలపై మండిపడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ సిటీ మెజిస్ట్రేట్ అలంకార్ అగ్నిహోత్రి తన పదవికి రాజీనామా చేశారు. అగ్ర వర్ణాల విద్యార్థుల హక్కులకు ఈ నిబంధనలు విఘాతం కలిగిస్తాయని ఆరోపించారు. ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద శిష్యులను శిఖలు పట్టి లాగడాన్ని కూడా అగ్నిహోత్రి వ్యతిరేకించారు.
యూజీసీ మార్గదర్శకాలపై నిరసన వ్యక్తం చేస్తూ నోయిడాకు చెందిన బీజేపీ యువ మోర్చా ఉపాధ్యక్షుడు రాజు పండిట్ తన పదవికి రాజీనామా చేశారు. యూజీసీ అమలు చేస్తున్న నిబంధనలను నల్ల చట్టంగా అభివర్ణించారు. అగ్ర వర్ణాల విద్యార్థుల ప్రయోజనాలకు పూర్తి విరుద్ధంగా ఈ నిబంధనలు ఉన్నాయన్నారు. కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బీహార్‌లోని హాజీపూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూజీసీ నిబంధనలు, నిరసనల గురించి విలేకర్లు ఆయనను అనేకసార్లు ప్రశ్నించినప్పటికీ, ఆయన స్పందించలేదు. మతపరమైన నినాదాలు మాత్రమే చేశారు.