Advance Booking | రైలు టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ (Advance Booking)ను 120 రోజుల నుంచి 60 రోజులకు కుదిస్తూ రైల్వే బోర్డు ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కొత్త నిబంధనలు (Train Ticket Booking Rule) నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం.. నేటి నుంచి టికెట్లు బుక్ చేసుకోవాలంటే 60 రోజుల లోపు ప్రయాణానికే రైలు టికెట్‌ను ముందుగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పటికే అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్న (Reservation Period) వారికి ఈ కొత్త రూల్స్ వర్తించవు. వారికి 120 రోజుల రిజర్వేషన్ పీరియడ్ వర్తిస్తుంది.
కాగా, గతంలో రైల్వే టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ 60 రోజులే ఉండేది. 2015 మార్చి 25న దీనిని 120 రోజులకు పెంచారు. 120 రోజుల అడ్వాన్స్ బుకింగ్ వల్ల క్యాన్సలేషన్లు ఎక్కువ అవుతున్నాయని, ప్రయాణాలు రద్దు చేసుకోవడం వల్ల బెర్త్‌లు వృథా అవుతున్నాయని రైల్వే బోర్డు తెలిపింది. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్‌లో 21 శాతం రద్దు అవుతున్నాయని, 4-5 శాతం మంది ప్రయాణికులు ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నప్పటికీ టికెట్లు క్యాన్సల్ చేసుకోవడం లేదని పేర్కొన్నది.
అసలైన ప్రయాణికులకు టికెట్లు లభించే అవకాశాలను పెంచేందుకు గడువును తగ్గించినట్టు తెలిపింది. అడ్వాన్స్ బుకింగ్‌కు తక్కువ కాల పరిమితి ఉండే తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్ల బుకింగ్‌లో మార్పు లేదని రైల్వే బోర్డు పేర్కొన్నది. విదేశీయులు 365 రోజుల ముందు రైలు టికెట్లు బుక్ చేసుకునే విధానంలోనూ మార్పు లేదని తెలిపింది. ఈ మేరకు గత నెల 16న రైల్వే బోర్డు తన నిర్ణయాన్ని ప్రకటించింది.
Also Read..
Chenab Bridge | చీనాబ్ బ్రిడ్జ్‌పై కన్నేసిన పాక్.. చైనా కోరిక మేరకు సమాచార సేకరణ
Charuhasan | ఆసుపత్రిలో చేరిన కమల్ హాసన్ సోదరుడు.. ఫొటోలు షేర్ చేసిన సుహాసిని