Rajasthan | ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల ఆత్మహత్య (Prevent Suicides)లు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఒత్తిడి కారణంగా గత కొంతకాలంగా విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వసతి గృహాల్లోని ఫ్యాన్లకు ఉరివేసుకోవడం, విషం తాగడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే 2025-26 అకాడమిక్ ఇయర్‌ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల ఆత్మహత్యలు నివారించేందుకు కోటా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ‘కోటా కేర్స్’ ప్రచారం కింద కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లకు కోటా జిల్లా యంత్రాంగం సరికొత్త మార్గదర్శకాలను (New rules) విడుదల చేసింది.
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు వచ్చే విద్యార్థుల జీవన వ్యయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ ప్రచారం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా పట్టణంలో ఉన్న మొత్తం 4 వేల హాస్టళ్లలో భద్రత, జాగ్రత్తలపై చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గతంలో వసతి గృహాల యాజమాన్యాలు డిపాజిట్‌గా ఏడాది మొత్తం ఫీజును మొదట్లోనే వసూలు చేసేవి. ఇకపై ఆ ఫీజును రూ.2 వేల వరకు మాత్రమే వసూలు చేసేలా నిబంధనలు విధించారు.
కోటా జిల్లా కలెక్టర్ డాక్టర్ రవీంద్ర గోస్వామి ఈ మేరకు మార్గదర్శకాలను ప్రకటించారు. కోటా కేర్స్ క్యాంపెయిన్‌లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా హాస్టల్ గదుల్లో స్ప్రింగ్ తరహా సీలింగ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండేలా వసతి గృహాల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తామన్నారు.
ఇది మాత్రమే కాకుండా.. విద్యార్థులు ఒత్తిడిని జయించేందుకు వీలుగా వన్ టైమ్ పాస్ ప్రాతిపదికన చంబల్ రివర్ ఫ్రంట్, ఆక్సిజన్ జోన్ పార్కులోకి ఉచిత ప్రవేశం కల్పిస్తామన్నారు. హాస్టళ్లలో సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం వంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. హాస్టల్ సిబ్బంది రాత్రిపూట మాన్యువల్ హాజరును తప్పనిసరిగా నిర్వహించాలని స్పష్టం చేశారు. అలాగే విద్యార్థులకు హాస్టళ్లలో వినోద ప్రదేశాలు కూడా ఉండేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్స్ వద్ద ‘కోటా కేర్స్’ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వివరించారు.
వరుస ఆత్మహత్యల కారణంగా కోటాకు వచ్చే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. చాలా హాస్టళ్లు ఖాళీ అవుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరానికి కోటా హాస్టళ్లకు వచ్చే విద్యార్థుల సంఖ్య 2 లక్షల నుంచి 1.24 లక్షలకు పడిపోయింది. ప్రస్తుతం 40 శాతం కంటే తక్కవు ఆక్యుపెన్సీ ఉంది. దీని కారణంగా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది.
కాగా, ఇప్పటికే కొన్ని హాస్టళ్లు, పీజీల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను అధికారులు ఏర్పాటు చేశారు. లోడ్‌ను గుర్తించిన వెంటనే అన్ కాయిల్ అయ్యేలా ఈ ఫ్యాన్లను తయారు చేశారు. లోడ్ అవ్వగానే సీలింగ్ నుంచి ఫ్యాన్ కిందకు జారిపోతుంది. ఈ చర్యలతో కాస్తమేర ఆత్మహత్య ఘటనలను తగ్గించొచ్చని అధికారులు భావిస్తున్నారు.
Also Read..
Maha Kumbh | యాత్రికులతో కిటకిటలాడుతున్న ప్రయాగ్‌రాజ్.. 65 కోట్ల మంది పుణ్యస్నానాలు
Bihar cabinet | నేడు బీహార్ క్యాబినెట్ విస్తరణ.. కొత్తగా ఆరుగురికి మంత్రివర్గంలో చోటు..!
Mahua Maji | కుంభమేళా నుంచి తిరిగివస్తుండగా ప్రమాదం.. ఎంపీకి గాయాలు