న్యూఢిల్లీ, జూన్ 18 : జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే ప్రైవేటు వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వచ్చే ఆగస్టు 15 నుంచి రూ.3000 విలువైన వార్షిక ఫాస్టాగ్ పాస్‌ను అందించనున్నట్టు బుధవారం వెల్లడించింది. ఈ పాస్‌పై జాతీయ రహదారుల మీద 200 ట్రిప్పులు లేదా ఏడాది వరకు (ఏది ముందైతే అది) ప్రయాణించవచ్చని పేర్కొంది. ఈ పాస్ వాణిజ్య వాహనాలకు వర్తించదు. కేవలం ప్రైవేటు కార్లు, జీప్‌లు, వ్యాన్లకు మాత్రమే జారీ చేస్తారు. ప్రతినిత్యం ఫాస్టాగ్‌లను రీచార్జి చేసుకొనే అవసరం లేకుండా టోల్ చార్జీలు కట్టకుండా జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఏడాది లోపే 200 ట్రిప్పులు పూర్తి అయితే వెంటనే మళ్లీ రీచార్జి చేసుకోవచ్చని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు వంటి క్లోజ్డ్ రహదారులపై ఎగ్జిట్ పాయింట్ వద్ద మాత్రమే టోల్ వసూలు చేస్తున్నారు. ఈ పాస్ ద్వారా కూడా అదే విధంగా ఒక ఎంట్రీ-ఎగ్జిట్‌ను ఒక ట్రిప్‌గా పరిగణించి టోల్ వసూలవుతుందని వివరించారు. ఇక ఓపెన్ టోల్ రోడ్ల మీద ఎన్ని టోల్ బూత్‌లు దాటితో అన్ని ట్రిప్లుగా పరిగణిస్తారని పేర్కొన్నారు.
వార్షిక పాస్ వల్ల ఒక్కో ట్రిప్‌కు అయ్యే సగటు ఖర్చు రూ.15 మాత్రమేనని గడ్కరీ వివరించారు. ఒక పాస్ గరిష్ఠంగా 200 ట్రిప్‌లకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఉదాహరణకు రెండు నగరాల మధ్య నాలుగు టోల్గేట్లు దాటాల్సి వస్తే.. వెళ్లి రావడాన్ని ఎనిమిది ట్రిప్పులుగా పరిగణిస్తారు. ఈ లెక్కన వార్షిక పాస్ తీసుకుంటే ప్రతి టోల్గేట్ వద్ద సగటున రూ.15 చెల్లించినట్టవుతుంది అని తెలిపారు. ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్నవారు కొత్తగా మరో ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రస్తుతమున్న ఫాస్టాగ్పైనే వార్షిక పాస్‌ను కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఈ పాస్‌లు జాతీయ రహదారులు (ఎన్‌హెచ్), జాతీయ ఎక్స్‌ప్రెస్‌వే (ఎన్ఈ)లపైనే చెల్లుబాటవుతాయని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు నిర్వహించే ఎక్స్‌ప్రెస్‌వేస్, రాష్ట్ర రహదారులు తదితర రోడ్లపై ఉండే టోల్ బూత్‌ల వద్ద పాత పద్ధతిలోనే ఫాస్టాగ్ పనిచేస్తుందని పేర్కొన్నారు. వార్షిక పాస్ తీసుకోవడం తప్పనిసరి కాదని, ప్రస్తుతమున్న ఫాస్టాగ్ వ్యవస్థ యథాతథంగా కొనసాగుతుందని వివరించారు. వాణిజ్య వాహన యజమానులు ఈ పాస్ తీసుకొనేందుకు ప్రయత్నిస్తే ఎటువంటి సమాచారం లేకుండానే రద్దు చేస్తామని హెచ్చరించారు.
గత ఏడాది డిసెంబర్ ఒకటి నాటికి దేశవ్యాప్తంగా 10.1 కోట్ల ఫాస్టాగ్‌లు జారీ అయ్యాయి. వార్షిక పాస్‌ల కొనుగోలు, రెన్యువల్‌ను త్వరలోనే రాజ్‌మార్గ్ యాత్రా యాప్‌తోపాటు ఎన్హెచ్ఏఐ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచుతామని గడ్కరీ తెలిపారు. జాతీయ రహదారులపై ప్రస్తుతం ఫాస్టాగ్‌ల ద్వారా ప్రతిరోజు సగటున రూ.200 కోట్ల వరకు వసూలవుతున్నది. టోల్ బూత్‌ల ద్వారా వాహనాలలో 53 శాతం ప్రైవేటు కార్లే ఉన్నప్పటికీ వాటిద్వారా కేవలం 21 శాతం ఆదాయం మాత్రమే వస్తున్నది.
వార్షిక ఫాస్టాగ్ పాస్
ధర: ఏడాదికి రూ.3 వేలు
అందుబాటులోకి: 2025 ఆగస్టు 15
చెల్లుబాటు: ఏడాదిపాటులేదా 200 ట్రిప్పులు (ఏది ముందు అయితే అది)
కవరేజ్: జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలు