Stubble Burning | న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత తీవ్రంగా పతనమవుతుండటంతో కేంద్రం కఠిన చర్యలు ప్రారంభించింది. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పంట వ్యర్థాలు తగులబెట్టినవారికి విధించే జరిమానాను రెట్టింపు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, రెండు ఎకరాల కన్నా తక్కువ భూమి గల రైతులపై పర్యావరణ నష్టపరిహారం రూ.5 వేలు విధించవచ్చు. రెండెకరాల నుంచి ఐదు ఎకరాల లోపు భూమి కలవారికి రూ.10 వేలు, ఐదు ఎకరాల కన్నా ఎక్కువ భూమి కలవారికి రూ.30 వేల వరకు విధించవచ్చు.
ఢిల్లీవాసులు గాలి, నీటి కాలుష్యాలతో సతమతమవుతున్నారు. యమునా నది నీరు విపరీతంగా కలుషితమైంది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో గురువారం ఉదయం 9 గంటలకు గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 367కు చేరింది. కొన్ని ప్రాంతాల్లో ఇది 400కు చేరింది. ఇటీవల కాలుష్యం కారణంగా శ్వాసకోశ వ్యాధులతో దవాఖానలకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నదని వైద్యులు తెలిపారు.