న్యూఢిల్లీ, నవంబర్ 17 : లాభదాయక పదవుల్లో కొనసాగుతున్న పార్లమెంట్ సభ్యులపై అనర్హత వేటు వేసేందుకు 65 ఏండ్ల క్రితం తీసుకొచ్చిన పాత చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. దాని స్థానంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా త్వరలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. దీనిలో భాగంగా కేంద్ర న్యాయశాఖ ఆధ్వర్యంలోని శాసన విభాగం 16వ లోక్సభలో కల్రాజ్ మిశ్రా నేతృత్వంలోని జేసీపీవో (జాయింట్ కమిటీ ఆన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్) చేసిన సిఫారసులకు అనుగుణంగా ‘పార్లమెంట్ (అనర్హత నిరోధక) బిల్లు-2024’ ముసాయిదాను రూపొందించింది. ఇది కార్యరూపం దాల్చితే స్వచ్ఛ భారత్ మిషన్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్-గ్రామీణ్ కౌశల్ యోజన లాంటి పథకాలకు నామినేట్ అయిన ఎంపీలకు అనర్హత వేటు నుంచి రక్షణ లభిస్తుంది.