Supreme Court | న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ‘చట్టానికి కళ్లు లేవు’ అన్న అపవాదు నుంచి బయటపడటానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం నడుం కట్టింది. ఇప్పటివరకు కళ్లకు గంతలతో కుడి చేతితో త్రాసు, ఎడమ చేతిలో కత్తితో ఉన్న న్యాయదేవత విగ్రహం స్థానంలో కళ్లకు గంతలు లేకుండా, కత్తి స్థానంలో రాజ్యాంగాన్ని చేతబట్టి ఉన్న కొత్త విగ్రహాన్ని సుప్రీం కోర్టులో ఏర్పాటు చేశారు. కళ్లకు గంతలు కట్టడం చట్టం ముందు సమానత్వాన్ని సూచించడానికి ఉద్దేశించినది.
వివరంగా చెప్పాలంటే కేసులోని వాది, ప్రతివాదులు సంపద, అధికారం, కులం, మతం ఏవీ న్యాయదేవత చూడదు. అదే సమయంలో అన్యాయాన్ని, అధికారాన్ని శిక్షించే ఆయుధంగా కత్తిని సూచిస్తుంది. అయితే న్యాయదేవత కండ్లకు గంతలను కట్టడంపై చాలాకాలంగా విమర్శలు కూడా ఉన్నాయి. ఆమె నిజాన్ని చూడదని, గుడ్డిదని, చట్టానికి కళ్లు లేవని కొందరు పేర్కొనేవారు. ఈ అపవాదు నుంచి బయటపడటానికి సీజేవై చంద్రచూడ్ నడుం బిగించారు.
ఆయన ఆదేశాల మేరకు సుప్రీం కోర్టులోని జడ్జీల లైబ్రరీలో ఏర్పాటు చేసిన విగ్రహంలో కండ్లకు ఎలాంటి గంతలు లేవు. ఎడమ చేతిలోని కత్తి స్థానంలో రాజ్యాంగాన్ని ఉంచారు. కత్తిలా ఉన్న వలసవాద యుగం నాటి భారతీయ ఇండియన్ పీనల్ కోడ్ లాంటి క్రిమినల్ చట్టాలను విడిచిపెట్టి భారతీయ న్యాయ సంహిత ద్వారా భర్తీ చేయడాన్ని ప్రతీకగా రాజ్యాంగాన్ని ఉంచారు.