న్యూఢిల్లీ: అన్ని కోర్టుల్లో కళ్లకు గంతలు, ఒక చేతిలో త్రాసు, మరో చేతిలో కత్తి ఉన్న న్యాయదేవతా విగ్రహాలు కనిపిస్తాయి. చట్టం ముందు సమానత్వాన్ని కళ్ల గంతలు, న్యాయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్పుల వెల్లడిని త్రాసు సూచిస్తాయి. ( (New Justice Statue) వ్యక్తుల సంపద, అధికారం లేదా ఇతర హోదాలను న్యాయస్థానాలు చూడవని, వాటి ఆధారంగా తీర్పులు ఇవ్వబోవని వీటి అర్థం. అలాగే కోర్టుల అధికారాన్ని, అన్యాయాన్ని శిక్షించే శక్తిని న్యాయ దేవత ఎడమ చేతిలోని కత్తి సూచిస్తుంది.
Justice Statue
కాగా, బ్రిటీష్ వలసపాలన నాటి విధానాలకు భారత్ స్వస్తి చెబుతోంది. భారతీయ శిక్షాస్మృతి వంటి క్రిమినల్ చట్టాల పేరును భారతీయ న్యాయ సంహితగా మార్పు చేశారు. ఈ నేపథ్యంలో న్యాయ దేవతా విగ్రహంలో కూడా మార్పులు ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ భావించారు. దీంతో ఆయన సూచన మేరకు సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల లైబ్రరీలోని కొత్త న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చట్టం గుడ్డిది కాదన్న సందేశాన్ని ఇచ్చారు.
మరోవైపు కొత్తగా ఏర్పాటు చేసిన ఈ న్యాయ దేవత కళ్లకు గంతలు లేవు. అలాగే ఎడమచేతిలో కత్తికి బదులు రాజ్యాంగం పుస్తకం ఉంది. అయితే సమాజంలో సమతౌల్యాన్ని, న్యాయ ప్రమాణాలను సూచించే న్యాయదేవత కుడి చేతిలోని త్రాసులో ఎలాంటి మార్పు చేయలేదు. కేసులో ఇరు వర్గాల వాదనలు, వాస్తవాల ఆధారంగా కోర్టు ఇచ్చే తీర్పులకు సంకేతంగా ఈ తూకాన్ని పరిగణిస్తారు.