వారణాసి : ఆధునిక భారత దేశం శత్రుదేశాలకు కాలభైరవుడు అవుతాడని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. తన స్వంత నియోజకవర్గం వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. భారత దేశ శత్రువులు భూగర్భంలో కూడా బ్రతికి ఉండరాదు అని అన్నారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ గురించి ఆయన ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ పార్టీ వైఖరిని విమర్శించారు. ఆపరేషన్ సింధూర్ను తమాషా అని పేర్కొన్న కాంగ్రెస్‌ను తప్పుపట్టారు. తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీ పరిణీతి షిండే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్‌ను ఎవరైనా తమాషా అని పిలుస్తారా అని ప్రధాని అన్నారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ వల్ల విపక్ష నేతలకు కడుపు నొప్పి పుడుతోందన్నారు. పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామన్న వాస్తవాన్ని కాంగ్రెస్ కానీ, దాని మిత్రులు జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. విశ్వనాథుడి ఆశీర్వాదంతో ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయ్యిందన్నారు. ఆపరేషన్ సింధూర్‌తో ప్రతీకారం తీర్చుకున్నామన్నారు.
కాశీలో ఉన్న మాస్టర్లను అడగాలనుకుంటున్నానని, భారత శక్తిపై మీరు గర్వంగా ఫీలవ్వడం లేదా అని ప్రధాని అన్నారు. భారత్‌లో తయారీ అయిన ఆయుధాలు ఆపరేషన్ సింధూర్ సమయంలో తమ సత్తాను చాటినట్లు చెప్పారు. పాకిస్థాన్‌లో ఉన్న చాలా వైమానిక స్థావరాలు ఇంకా ఐసీయూ స్థితిలోనే ఉన్నాయని, పాకిస్థాన్ బాధపడుతోందని, దాన్ని ఎవరైనా అర్థం చేసుకోగలరని, కానీ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు మాత్రం పాకిస్థాన్ బాధను చూడలేకపోతున్నారని ప్రధాని అన్నారు. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే వాళ్లు పాకిస్థాన్‌లోనూ, ఇండియాలోనూ ఏడుస్తున్నారని విమర్శించారు.
మన సైనిక బలగాలను కాంగ్రెస్ నిత్యం అవమానిస్తోందని, ఆపరేషన్ సింధూర్ను తమాషా అని పిలుస్తోందని మోదీ అన్నారు. కాంగ్రెస్ వ్యాఖ్యలను సిగ్గులేని చర్యగా ఆయన అభివర్ణించారు. ఉగ్రవాదులను ఇప్పుడు ఎందుకు చంపారని సమాజ్‌వాదీ పార్టీ అడుగుతోందని, వాళ్లను పిలిచి.. చంపాలా వద్దా అని అడగాలా, లేదంటే వాళ్లు పారిపోయే వరకు వేచి చూడాలని అని ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశ రుద్ర స్వరూపాన్ని ప్రపంచం తిలకించిందని, ఇప్పుడు నవ భారతం శత్రువులకు కాలభైరవుడిగా మారినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.