Corona | న్యూఢిల్లీ: భారత్‌లో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొవిడ్ కొత్త రూపాంతరాలు (వేరియంట్లు) ఎన్బీ.1.8.1, ఎల్ఎఫ్.7లను గుర్తించినట్లు ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం (ఇన్సాకోగ్) శనివారం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక సహా మరికొన్ని రాష్ర్టాల్లో ఈ కేసులు నమోదవుతున్నాయని వెల్లడించింది. మూడేండ్లలో తొలిసారి ఢిల్లీలో 23 మందికి ఈ వైరస్ సోకడంతో ప్రభుత్వాలు దవాఖానలను అప్రమత్తం చేస్తున్నాయి. కేసులు తక్కువగానే ఉన్నాయని, అయినా తాము అప్రమత్తంగా ఉన్నామని, కేసుల సంఖ్యను, పరిస్థితులను సమీక్షిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇటీవలి కాలంలో హాంగ్ కాంగ్, సింగపూర్, థాయ్‌లాండ్, చైనా తదితర దేశాల్లో వేల కొద్దీ కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తికి కారణం జేఎన్.1 రూపాంతరం, దాని ఉప రూపాంతరాలేనని అధికారులు తెలిపారు.
కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, తీవ్ర స్థాయి వ్యాధులతో బాధ పడేవారు జాగ్రత్తగా ఉండాలని వైద్య, ఆరోగ్య నిపుణులు సూచించారు. ముక్కు, నోరుకు మాస్క్ ధరించాలని, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని తెలిపారు.
ప్రారంభంలో సార్స్-కోవ్-2 (SARS-CoV-2) వచ్చింది. దీనికి అనేక రూపాంతరాలు (వేరియంట్స్), ఉప రూపాంతరాలతో పెద్ద కుటుంబం ఏర్పడింది. కొవిడ్ మహమ్మారి ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో కొత్త ఉప రూపాంతరాలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో జేఎన్.1 రూపాంతరం, దాని ఉప రూపాంతరాలైన ఎల్ఎఫ్.7, ఎన్బీ.1.5 ఉప రూపాంతరాలపై చర్చ జరుగుతున్నది. జేఎన్.1 స్పైక్ ప్రొటీన్‌లో 35కుపైగా పరివర్తనలు జరిగాయి. ఒమిక్రాన్ ఉప రూపాంతరాలైన ఎక్స్‌బీబీ.1.5.జేఎన్.1 వంటివాటి కన్నా చాలా సులువుగా జేఎన్.1 వ్యాపిస్తుంది. జేఎన్.1 సబ్ వేరియంట్లు అంతకు ముందు వేధించిన ఒమిక్రాన్, దాని ఉప రూపాంతరాల మాదిరిగా కాకుండా, కేవలం ఊపిరితిత్తుల పైభాగంలో మాత్రమే ఇన్ఫెక్షన్ను కలిగిస్తుందని వైద్యులు చెప్తున్నారు.
ఊపిరితిత్తులపై వీటి ప్రభావం ఉండదని, ప్రాణ వాయువును తీసుకోలేకపోవడం, రక్తస్రావం, రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలు ఉండవని తెలిపారు. ఒమిక్రాన్, దాని ఉప రూపాంతరాలు అంతటా పరిమిత స్థాయికి, అంటే, సీజనల్ జ్వరాల స్థాయికి క్షీణించినట్లు పేర్కొన్నారు. అప్పుడప్పుడు ఎక్కువగా విజృంభించవచ్చునని ఊహించామని, అదే ఇప్పుడు జరుగుతున్నదన్నారు. ఆరోగ్యవంతులు రెండు వారా ల్లో కోలుకోగలుగుతారని డాక్టర్లు చెప్పారు.