New CBI Director | కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కు కొత్త డైరెక్టర్ రానున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సీబీఐ డైరెక్టర్ నియామక కమిటీ సమావేశం జరిగింది. లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, సీజేఐ జస్టిస్ సంజీవ్ కన్నా సమావేశానికి హాజరయ్యారు. ఈ కీలక సమావేశంలో పాల్గొనేందుకు లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ పీఎంవోకు చేరుకున్నారు. సీబీఐ డైరెక్టర్ని నియమించే అధికారం కేబినెట్ నియామక కమిటీ (ACC)కి ఉంటుంది. ఈ ఉన్నత స్థాయి కమిటీకి చైర్మన్‌గా ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సీబీఐ డైరెక్టర్ పదవికి ఒక పేరును ఆమోదిస్తుంది. ఈ కమిటీ కలిసి కూర్చుని సీబీఐ డైరెక్టర్ నియామకం కోసం పేరును చర్చించి, ఆ పేరును ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది.
సీబీఐ డైరెక్టర్ పదవీకాలం సాధారణంగా రెండేళ్లు ఉంటుంది. అయితే, ప్రత్యేక పరిస్థితుల్లో ఐదేళ్ల వరకు పొడిగించే వెసులుబాటు ఉంది. ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలం ఈ నెల 25తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త డైరెక్టర్ని నియమించేందుకు ఏసీసీ సమావేశమైంది. ప్రవీణ్ సూద్ మే 25, 2023న ప్రధాన దర్యాప్తు సంస్థ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2024లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. ఆ తర్వాత పదవీకాలాన్ని పొడిగించారు. గతంలో ఆయన కర్నాటక డీజీపీగా పని చేశారు. ప్రవీణ్ సూద్ 1986 బ్యాచ్‌కు చెందిన కర్నాటక కేడర్ ఐపీఎస్ అధికారి. ఆయన ఐఐటీ ఢిల్లీలో విద్యనభ్యసించారు. ప్రస్తుతం ఆయన పదవీకాలం సైతం పూర్తికానుండడంతో కొత్త డైరెక్టర్ ఎంపిక కోసం ఈ సమావేశం జరుగుతున్నది. ఇందులో ఎవరి పేరును ఖరారు చేస్తారనే చర్చ జరుగుతున్నది.