భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత పది రోజులుగా కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. తాజాగా సోమవారం రాత్రి కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని ప్యూన్‌బస్తీకి చెందిన కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ తలుగు అనిల్ 100 మంది కార్యకర్తలతో కలిసి గులాబీ గూటికి చేరారు. దీంతో మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగిలినట్లుగా ఉంది. కొత్తగూడెం పరిధిలో ఇప్పటికే నలుగురు మాజీ కౌన్సిలర్లు ఎంపీ వద్దిరాజు, జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పట్టణంలోని జీఆర్బస్తీకి చెందిన సీనియర్ మాజీ కౌన్సిలర్లు ఇద్దరు భీమాశ్రీధర్, శ్రీవల్లి హైదరాబాద్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా, మరో మాజీ కౌన్సిలర్ ఏమునూరి లక్ష్మీబాయి, కొడుకు బీజేపీలో యూత్ లీడర్‌గా ఉన్న శివ కూడా బీఆర్ఎస్లో చేరారు. మేదరబస్తీకి చెందిన మహేష్, జీఆర్బస్తీకి చెందిన సుజాతతోపాటు 500 మంది కార్యకర్తలు సైతం బీఆర్ఎస్లో చేరారు. ఇల్లెందులో మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్, అశ్వారావుపేటలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుల సమక్షంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
కాంగ్రెస్ నాయకుల ఇళ్ల వద్ద నిరసనలు
కాంగ్రెస్, సీపీఐ పొత్తులు బెడిసికొట్టడంతో ఎవరికివారే పోటీకి సై అంటున్నారు. గత వారం రోజులుగా పొత్తుల కోసం కుస్తీలు పట్టినా చివరికి బెడిసికొట్టడంతో రెండు పార్టీలు ఒకరు సీపీఎంతో, మరొకరు టీడీపీతో జతకట్టి పోటీకి దిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేషన్ బరిలో ఉండాల్సిన నాయకులకు టికెట్టు ఇవ్వకపోవడంతో కొన్ని వార్డుల్లో నిరసన వ్యక్తం చేశారు. ఆ పార్టీ నాయకుడు ఆళ్ల మురళి ఇంటి ముందు ఆశావహుడు వెంకటేశ్వర్లు కార్యకర్తలతో నిరసన వ్యక్తం చేశారు. రామవరం, బర్మాక్యాంపు ఏరియాలో ఉద్యమంలో పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వకపోవడంతో ఆందోళనకు సిద్ధమయ్యారు. తర్వాత బుజ్జగింపుల పర్వంతో అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఏదేమైనా పోలింగ్ సమయంలో రెబల్స్ బెడద కాంగ్రెస్‌కు తప్పేటట్లు లేదని టికెట్టు రాని అభ్యర్థులు చెబుతున్నారు.