న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో బంధుప్రీతి నానాటికీ పెరుగుతున్నది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానంలో ఉండగా, బీజేపీ దానిని అనుసరిస్తున్నట్టు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫారమ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న 5,204 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో దాదాపు 21 శాతం మంది (1,107) రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినవారేనని శుక్రవారం విడుదలైన నివేదికలో ఏడీఆర్ పేర్కొంది. వారసత్వ రాజకీయాల ప్రాతినిధ్యం లోక్సభలో అత్యధికంగా 31 శాతంగా ఉండగా, రాష్ర్టాల అసెంబ్లీల్లో 20 శాతంతో అత్యల్పంగా ఉంది.
రాజ్యసభ, రాష్ట్ర శాసన మండళ్లలో ఈ సంఖ్య వరుసగా 21 శాతం, 22 శాతంగా ఉంది. ఇక, జాతీయ పార్టీల విషయానికొస్తే మొత్తం 3,214 మంది సిట్టింగ్ ప్రజాప్రతినిధుల నేపథ్యం విశ్లేషించగా, వారిలో 657 మంది (20 శాతం) రాజకీయు వారసత్వ నేపథ్యం ఉన్నవారేనని ఏడీఆర్ తెలిపింది. ఈ జాబితాలో కాంగ్రెస్ 32 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, 18 శాతంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండో స్థానంలో ఉన్నది. సీపీఐ, సీపీఎం కేవలం 8 శాతంతో అత్యల్ప వారసత్వ ప్రతినిధులను కలిగి ఉన్నాయి.
రాష్ట్ర పార్టీలకు చెందిన 1,809 మంది ప్రజాప్రతినిధులను విశ్లేషించగా, వారిలో 406 మంది (22 శాతం) వారసత్వ రాజకీయాల నుంచి వచ్చినవారే. రాష్ట్ర పార్టీలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ-ఎస్పీ) 42 శాతం, జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (42 శాతం), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (38 శాతం), తెలుగుదేశం పార్టీ (36 శాతం), ఎన్సీపీ (34 శాతం)లలో వారసత్వ ధోరణులు ఎక్కువగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. తృణమూల్ కాంగ్రెస్ (10 శాతం), అన్నాడీఎంకే (4 శాతం) వంటి పార్టీలలో ఈ శాతం తక్కువగా ఉంది.
రాష్ర్టాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్లోని 604 మంది ప్రజాప్రతినిధుల్లో అత్యధికంగా 141 మంది (23 శాతం) రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినవారే. ఈ విషయంలో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. జనాభా ఎక్కువగా ఉన్న రాష్ర్టాలలో ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా వారసత్వ ప్రతినిధుల వాటాను కలిగి ఉంది. ఇక్కడ 255 మంది సిట్టింగ్ ప్రజాప్రతినిధులలో 86 మంది (34 శాతం) రాజకీయ కుటుంబాల నేపథ్యం ఉన్నవారే. మహారాష్ట్రలో 403 మందిలో 129 మంది (32 శాతం), కర్ణాటకలో 326 మందిలో 94 మంది (29 శాతం) వారసత్వ నేపథ్యాన్ని కలిగి ఉన్నారు.
ఈ నివేదికలో ఆసక్తికరమైన మరో అంశం మహిళా వారసత్వం. పురుష ప్రజాప్రతినిధులలో 18 శాతం వారసత్వ ఉంటే, మహిళల్లో 47 శాతం ఉంది. వామపక్ష పార్టీలు, కొత్తగా ఏర్పడిన సంస్కరణవాద పార్టీలలో (సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ) వారసత్వ ధోరణి చాలా తక్కువగా ఉంది.