న్యూఢిల్లీ, డిసెంబర్ 8: దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై (Jawaharlal Nehru) ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)మరోసారి తన ఆరోపణాస్ర్తాలను సంధించారు. ముస్లిం లీగ్ నాయకుడు మొహమ్మద్ అలీ జిన్నా మతపరమైన అనుమానాలను తీర్చేందుకు జాతీయ గేయం వందే మాతరానికి నెహ్రూ ద్రోహం చేశారని మోదీ ఆరోపించారు. జాతీయ గేయాన్ని ముక్కలు చేసి నెహ్రూ భారత్‌ను బుజ్జగింపు రాజకీయాల బాట పట్టించి దేశ విభజనకు కారకులయ్యారని ఆయన నిందించారు. ప్రధాని ఆరోపణలను విపక్ష సభ్యులు గట్టిగా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ మాట్లాడుతూ వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ ప్రత్యేక చర్చను ప్రభుత్వం కోరిందని విమర్శించారు. వందే మాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చను ప్రారంభిస్తూ యావత్ దేశ ప్రజలను వందేమాతర గేయం ఏ విధంగా స్ఫూర్తిదాయకంగా నిలిచి స్వాతంత్య్ర పోరాటానికి
కార్యోన్ముఖులను చేసిందీ మోదీ గుర్తుచేశారు. మొహమ్మద్ అలీ జిన్నా మొదటిసారి 1937 అక్టోబర్ 15న వందే మాతరంపై తన వ్యతిరేకతను బయటపెట్టారని ప్రధాని తెలిపారు. ఐదు రోజుల తర్వాత నేతాజీకి లేఖ రాసిన నెహ్రూ.. జిన్నా మనోభావాలను తెలియచేస్తూ వందేమాతరానికి ఉన్న ఆనంద్‌మఠ్ నేపథ్యాన్ని, ముస్లింలకు ఆగ్రహం తెప్పించే అవకాశం గురించి వివరించినట్లు మోదీ చెప్పారు. ముస్లిం లీగ్ నిరాధార ప్రకటనలను తిప్పికొడుతూ వాటిని ఖండించాల్సింది పోయి అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు నెహ్రూ వందేమాతరంపై తన అంకితభావాన్ని ప్రకటించలేకపోగా ఆ గేయాన్నే ప్రశ్నించడం ప్రారంభించారని మోదీ ఆరోపించారు. 1937 అక్టోబర్ 26న కాంగ్రెస్ వందే మాతరంపై రాజీపడిందని, దాన్ని ముక్కలు చేయాలని నిర్ణయించిందని ఆయన చెప్పారు. ఈ నిర్ణయానికి సామాజిక సామరస్యం అనే ముసుగు తొడిగినప్పటికీ ముస్లిం లీగ్ ఎదుట కాంగ్రెస్ లొంగిపోయి, దాని ఒత్తిడికి తలొంచి బుజ్జగింపు రాజకీయాలను పాటించిందని మోదీ ఆరోపించారు. వందేమాతరంపై వివాదాలు సృష్టించి బీజేపీ మహా పాపం చేసిందని కాంగ్రెస్ తరఫున చర్చలో పాల్గొంటూ ప్రియాక గాంధీ విమర్శించారు బెంగాల్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే బీజేపీ ఈ పత్య్రేక చర్చను చేపట్టిందని ఆమె ఆరోపించారు.
బంకిం దా కాదు.. బంకిం బాబు
‘వందే మాతరం’పై చర్చలో ప్రధాని మాటలను టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ సరిదిద్దారు. ‘వందే మాతరం’ రచయిత బంకిం చంద్ర ఛటర్జీని ఉద్దేశించి మోదీ లోక్ సభలో మాట్లాడుతూ, ‘బంకిం దా’ అన్నారు. దీనిపై సౌగత రాయ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ‘దా’ అనే మాటను ఉపయోగించడం సరికాదని చెప్పారు. బెంగాలీలో స్నేహితులు, పెద్దన్నయ్యలను సంబోధించడానికి ఈ మాటను వాడతారు. పెద్దలను గౌరవించడం కోసం ‘బాబు’ను ఉపయోగిస్తారు. సౌగత రాయ్ మాటలను మోదీ విని, “మంచిది, ధన్యవాదాలు. మీ మనోభావాలను గౌరవిస్తున్నాను” అని చెప్పారు.