Neha Singh Rathore | ఢిల్లీ, మే 12 : మోదీ సర్కారు 140 కోట్ల మంది గౌరవప్రతిష్టలతో ఆటలాడిందని భోజ్‌పురి ఫోక్ సింగర్ నేహా సింగ్ రాథోడ్ మండిపడ్డారు. యుద్ధం చేయాలని ప్రభుత్వానికి ఎవరు చెప్పారని, యుద్ధ వాతావరణ సృష్టించి మధ్యలో కాడి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌లో ఒక వీడియో పోస్టు చేశారు. ‘దోమలను చంపేందుకు ఆలౌట్ సరిపోతుంది. ఇల్లు మొత్తం పొగ పెట్టాల్సిన అవసరం లేదు. సూదీతో అయ్యే పనికి సూదీనే వాడాలి, కత్తిని కాదు. అలాగే అన్నింటికి యుద్ధమే చేయాల్సిన అవసరమే లేదు. దౌత్యపరంగా కూడా కొన్ని పనులు అవుతాయి. యుద్ధం అనేది అంతిమ మార్గం మాత్రమే. యుద్ధమంటేనే అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని అర్థం. 26/11 ముంబయి దాడికి పాల్పడిన ఉగ్రవాదులందరినీ అప్పటి ప్రభుత్వం చంపేసింది. సజీవంగా పట్టుకున్నవాళ్లను కూడా ఉరితీసింది.
అన్ని సాక్ష్యాధారాలతో పాక్‌ను అందరి ముందు నగ్నంగా నిలబెట్టింది. ఫలితంగా పాకిస్థాన్ ఒంటరైంది. పాకిస్థాన్ అంటే ఏమిటో అందరికీ తెలిసొచ్చింది. బిర్యానీ తినాలని అప్పటి ప్రధానికి ఆహ్వానం రాలేదు. మోదీజీ వెళ్లినట్టుగా ఆయన పాకిస్థాన్‌కు వెళ్లలేదు. కానీ, ఇప్పటి సంగతి చూసుకుంటే.. మన దేశాన్ని యుద్ధం చేయాలని ప్రభుత్వానికి ఎవరూ చెప్పలేదు. మాక్ డ్రిల్స్‌తో యుద్ధ వాతావరణాన్ని సృష్టించమని కూడా చెప్పలేదు. మనపై దాడి చేసిన ఉగ్రవాదులందరినీ పట్టుకోవడం ప్రధానిగా మీ బాధ్యత. సాక్ష్యాధారాలను సేకరించి, దర్యాప్తు చేసి, వారిని శిక్షించి మరోసారి పాక్‌ను నడిరోడ్డుపై నగ్నంగా నిలబెట్టాలి. అప్పుడు పాక్‌కు ఎవరు మద్దతుగా నిలుస్తారో చూడాల్సింది. కానీ, మీరు ఏం చేశారు. చక్కటి అవకాశాన్ని వృథా చేశారు. దేశమంతా మీ వెంటే ఉంది. అయినా మీరు దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టివేశారు.