NEET-UG | నీట్-యూజీ పరీక్షల్లో అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. కేసు విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సీజేఐ ధర్మాసనం పేర్కొంది. కేంద్రం, ఎన్టీఏ దాఖలు చేసిన అఫిడవిట్లను సుప్రీంకోర్టు స్వీకరించింది. ఈ కేసులో వాదనలు జరిగే ముందు అఫిడవిట్లను పరిశీలించాల్సి ఉండడంతో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణను గురవారానికి వాయిదా వేసింది. కేంద్రం, ఎన్టీఏ దాఖలు చేసిన అఫిడవిట్లపై పిటిషనర్లు స్పందనను దాఖలు చేయాల్సి ఉండగా.. విచారణను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఐఐటీ మద్రాస్ డేటా అనలిటిక్స్ నివేదిక ఆధారంగా అవకతవకలు జరిగినట్లుగా, ఆసాధారణంగా అభ్యర్థులెవరికీ మార్కులు రాలేదని కేంద్రం అఫిడవిట్లో పేర్కొంది. టెలిగ్రామ్ యాప్‌లో నీట్ పేపర్ ఫొటోలను చూపించే వీడియో నకిలీదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సర్వోన్నత న్యాయసానికి తెలిపింది.
నీట్ యూజీకి సంబంధించిన డేటాపై సమగ్ర సాంకేతిక మూల్యాంకనాన్ని మద్రాస్‌లోని ఐఐటీ నిర్వహించిందని పేర్కొంది. ఇక నీట్ యూజీ కౌన్సెలింగ్‌ను ఈ నెల మూడో వారంలో ప్రారంభిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఎవరైనా మాల్ ప్రాక్టీస్ కారణంగా లబ్ధి పొందారని తేలితే కౌన్సెలింగ్ ప్రక్రియ ఏ దశలోనైనా.. ఆ తర్వాత కూడా సదరు వ్యక్తుల అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుందని పేర్కొంది. నీట్ పవిత్రతను కాపాడేందుకు ఇకపై చర్యలు తీసుకుంటామని.. ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూసుకుంటామని పేర్కొంది. పరీక్షల పవిత్రత, విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపింది. పబ్లిక్ పరీక్షలో పారదర్శకత, విశ్వసనీయతను నిర్ధారించేందుకు ఫిబ్రవరి 12న పార్లమెంట్ ‘పబ్లిక్ ఎగ్జామినేషన్ చట్టం-2024’ను రూపొందించిందని, ఇది జూన్ 21 నుంచి అమలులోకి వచ్చిందని వివరించింది.