నీట్ యూజీ రద్దు
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మే 3న నిర్వహించిన నీట్ యూజీ-2026 పరీక్ష మంగళవారం రద్దయ్యింది. ప్రశ్నపత్రం లీక్ అయినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది.
- యూజీ ప్రశ్నపత్రం లీక్ కావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం
- మళ్లీ పరీక్షకు వారంలో షెడ్యూల్
- సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశం
- బీజేపీ పాలిత రాజస్థాన్‌లో తొలుత క్వశ్చన్ పేపర్ లీకేజీ బయటకు
- ఢిల్లీ సహా పలు రాష్ర్టాలకు గెస్ పేపర్‌గా ప్రశ్నపత్రం పంపిణీ
- పరీక్ష రద్దుతో 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఆగం
- కేంద్రం అసమర్థ వైఖరిపై భగ్గుమన్న విద్యార్థి సంఘాలు, విపక్షాలు
- మీడియాకు ముఖం చాటేసిన కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మే 3న నిర్వహించిన నీట్ యూజీ-2026 పరీక్ష మంగళవారం రద్దయ్యింది. ప్రశ్నపత్రం లీక్ అయినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. నీట్-యూజీ మళ్లీ నిర్వహించనున్నట్టు పేర్కొన్నది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను వారం పది రోజుల్లో విడుదల చేయనున్నట్టు తెలిపింది. ప్రస్తుత పరీక్ష ప్రక్రియను కొనసాగించడానికి వీలులేదంటూ దర్యాప్తు సంస్థలు ఇచ్చిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు వెల్లడించింది. పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్టు వివరించింది. విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ పేర్కొన్నది. ప్రశ్నపత్రం లీక్‌పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది.
మళ్లీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు
కొత్తగా నిర్వహించే పరీక్షకు విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవలసిన అవసరం లేదని, పరీక్ష ఫీజు చెల్లించనక్కర్లేదని ఎన్టీఏ తెలిపింది. పరీక్ష తేదీలను నిర్ణయించిన తర్వాత మళ్లీ అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని పేర్కొన్నది. నీట్ యూజీ-2026కి సుమారు 23 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష నిర్వహణ అనంతరం ఎగ్జామ్‌ను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
42 గంటల ముందు వాట్సాప్‌లో
మే 3న నీట్-యూజీ పరీక్ష జరిగింది. అయితే, పరీక్ష జరుగడానికి కేవలం 42 గంటల ముందు ప్రశ్నపత్రం వాట్సాప్‌లో పెద్దయెత్తున సర్క్యులేట్ అయినట్టు ప్రాథమికంగా తెలుస్తున్నది. బీజేపీ పాలిత రాజస్థాన్‌లో లీకేజీ వ్యవహారం తొలుత వెలుగుచూసినట్టు పోలీసులు గుర్తించారు. పరీక్షలో కెమిస్ట్రీ విభాగంలో వచ్చిన సుమారు 120కి పైగా ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీసు పేపర్‌ను గుర్తించినట్టు రాజస్థాన్ అదనపు డీజీపీ విశాల్ బన్సాల్ తెలిపారు. ఈ మెటీరియల్ రాజస్థాన్‌లోని సికార్‌లో పరీక్షకు 42 గంటల ముందు వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చినట్టు గుర్తించారు. ఇందులోని సమాచారం నీట్ ప్రశ్నపత్రంలోని 600 మార్కుల ప్రశ్నలతో పోలి ఉన్నట్టు తెలిపారు. మెటీరియల్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన 300కు పైగా చేతిరాత ప్రశ్నలు ఉన్నాయని డీజీపీ తెలిపారు. కొన్ని ప్రశ్నల్లోని జవాబుల క్రమం కూడా అచ్చం ఒకేలా ఉండడం పలు అనుమానాలకు తావిచ్చినట్టు వెల్లడించారు. రాజస్థాన్‌లో వెలుగు చూసిన ఈ గెస్ పేపర్ ఢిల్లీ, జమ్ముకశ్మీర్, బీహార్, కేరళ, ఉత్తరాఖండ్ తదితర రాష్ర్టాలకు కూడా పరీక్షకు ముందే సర్క్యులేట్ అయినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి రాజస్థాన్, కేరళ, బీహార్‌లో పలువురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
నాసిక్‌లో బీఏఎంఎస్ విద్యార్థి అరెస్టు
నీట్-యూజీ 2026 పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించి మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ 30 ఏండ్ల బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీఏఎంఎస్) విద్యార్థిని సీబీఐ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. సుభం ఖైర్మర్గా గుర్తించిన ఆ విద్యార్థి పుణెలోని మరో వ్యక్తి నుంచి రూ. 10 లక్షలు చెల్లించి ఈ లీకేజీ కుంభకోణానికి కేంద్రంగా ఉన్న గెస్ పేపర్‌ను కొనుగోలు చేసినట్లు అధికారులు చెప్పారు. ఆ తర్వాత హర్యానాకు చెందిన ఒక వ్యక్తికి రూ.15 లక్షలకు ఖైర్మర్ విక్రయించినట్లు వారు చెప్పారు. ఈ కేసు దర్యాప్తు కోసం సీబీఐ ఏర్పాటు చేసిన నాలుగు బృందాలు ఖైర్మర్ని అదుపులోకి తీసుకునేందుకు నాసిక్‌కు చేరుకున్నాయి. నాసిక్ క్రైమ్ బ్రాంచ్ మొదట ఖైర్మర్ను అదుపులోకి తీసుకుని సీబీఐ బృందాలకు అప్పగించాయి.
మీడియాకు ముఖం చాటేసిన ప్రధాన్

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, ఎగ్జామ్ రద్దుకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు మీడియా పలు ప్రశ్నలు వేసింది. అయితే, వేటికీ మంత్రి సమాధానం ఇవ్వలేదు. లీకేజీపై స్పందించాలని మీడియా ప్రతినిధులు పలుమార్లు కోరినప్పటికీ, ముఖం చాటేసిన ప్రధాన్.. కారులో వెళ్లిపోయారు
రూ. 28 లక్షలకు విక్రయం
ఈ ప్రశ్నపత్రాలను విద్యార్థులకు రూ. 20 వేల నుంచి రూ. 28 లక్షల వరకు విక్రయించారని, కొందరు అభ్యర్థుల నుంచి ముందుగానే రూ. 30 వేలకు పైగా వసూలు చేశారని పోలీసులు తెలిపారు. నీట్-యూజీ 2026 పరీక్ష అవకతవకలపై రాజస్థాన్ పోలీసులు జరుపుతున్న దర్యాప్తు గురించి తమకు తెలుసని ఆదివారం ఎన్టీఏ తెలిపింది. పరీక్ష జరిగిన కొద్ది రోజులకే అక్రమాల ఆరోపణల గురించి తమకే తొలుత సమాచారం అందిందని, ఆ తర్వాతే సంబంధిత దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేశామని కూడా ఏన్టీఏ పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

