PM Modi | హైదరాబాద్, జూన్ 20 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఒకవైపు నీట్ ప్రశ్నాపత్రం లీకుల దుమారం కొనసాగుతుండగా, యూజీసీ నెట్ పేపరూ లీక్ కావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో మోదీహయాంలో పరీక్షలు అభాసుపాలవుతున్నాయన్న విమర్శలు పెద్దయెత్తున వ్యక్తమవుతున్నాయి. దీన్ని ధ్రువపరుస్తూ.. గడిచిన ఏడేండ్లలో 70కి పైగా ఎగ్జామ్ పేపర్స్ లీకైనట్టు, దీంతో 1.5 కోట్ల మంది విద్యార్థుల జీవితంపై ప్రభావం పడినట్టు మీడియా నివేదికలు చెప్తున్నాయి. కేంద్రప్రభుత్వం ఆధీనంలోని ఏజెన్సీలు నిర్వహించే నీట్, నెట్, సీబీఎస్ఈ, ఎయిమ్స్ తదితర ఎగ్జామ్ పేపర్లు లీకవ్వడం గమనార్హం. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో 2015-2023 మధ్య పేపర్ లీకులకు సంబంధించి 14 కేసులు నమోదయ్యాయి. బీజేపీపాలిత యూపీలో 2017-2022 మధ్య ఆరు పేపర్లు లీక్ అయినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడు నీట్ పరీక్షలోనూ ఎన్డీయే పాలిత బీహార్లోనే అక్రమాలు బయటపడ్డాయి.
2015: సీబీఎస్ఈ నిర్వహించిన ఆలిండియా ప్రీ-మెడికల్ అండ్ ప్రీ-డెంటల్ ఎంట్రెన్స్ టెస్ట్‌లో అవకతవకలు బయటపడ్డాయి. దీంతో ఈ పరీక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
2018: సీబీఎస్ఈ 10, 12 తరగతులకు సంబంధించి మ్యాథ్స్, ఎకనమిక్స్ పేపర్లు పరీక్షకు ముందే వాట్సాప్‌లో లీక్ అయ్యాయి.
2021: ఎగ్జామ్‌కు అరగంట ముందే నీట్ పేపర్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడం సంచలనం సృష్టించింది. ఓ ఎగ్జామ్ సెంటర్ ఇంచార్జీ నిర్వాకం వల్లే ఇది జరిగినట్టు తేలింది.
2023: ఎయిమ్స్-నర్సు రిక్రూట్మెంట్ ఎగ్జామ్ పేపర్ సోషల్‌మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో ఎయిమ్స్ ఈ పరీక్షను తిరిగి నిర్వహించాల్సి వచ్చింది.
2024: ఎన్టీఏ నిర్వహించిన నీట్-యూజీ, యూజీసీ నిర్వహించిన నెట్ పేపర్లు లీకయ్యాయి. నెట్ పరీక్షను రద్దు చేసిన యూజీసీ పరీక్షను తిరిగి నిర్వహిస్తామన్నది. నీట్‌పై దుమారం కొనసాగుతున్నది.