NEET-UG 2026 : నీట్ 2026 పేపర్ లీకవ్వడంతో ఈ పరీక్షను ఎన్టీయే (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త పరీక్ష నిర్వహణ తేదీపై సందిగ్ధత నెలకొంది. తాజా సమాచారం ప్రకారం మరోసారి నీట్ 2026 పరీక్షను ఈ నెల 22న నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరో వారం లేదా పది రోజుల్లోనే పరీక్ష నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఎన్టీయే వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ విచారణ ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్త అయిన సీబీఐకి చేరింది. కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఇంతవరకు ఈ కేసును గుజరాత్‌కు చెందిన ఎస్‌వోజీ (స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్) విచారణ జరిపింది. ఈ సంస్థ నుంచి కేసు విచారణను సీబీఐ తీసుకుంది.
ఈ కేసులో ఇప్పటివరకు కీలక సూత్రధారులైన మనీష్ యాదవ్, రాకేష్ మాండవీర్యను ఎస్‌వోజీ పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, ఒక నీట్ అభ్యర్థి కుటుంబాన్ని కూడా ఎస్‌వోజీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నీట్ లీకేజీని విచారించనున్న సీబీఐ.. ఎన్టీయే అధికారుల్ని కూడా విచారించనుంది. మే 3న జరిగిన నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా 22.7 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరంతా ఇపుడు మరోసారి పరీక్షకు హాజరు కావాల్సి ఉంది.