NEET | న్యూఢిల్లీ, జూలై 5: లీకేజీ, అక్రమాల ఆరోపణల మధ్య వివాదంలో చిక్కుకొన్న నీట్ యూజీ-2024 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశాయి. మే 5న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను ఈ సందర్భంగా వ్యతిరేకించాయి. నీట్ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదని స్పష్టం చేశాయి. పరీక్షను రద్దు చేయడం వల్ల ప్రతికూల ప్రభావం పడుతుందని, లక్షల మంది నిజాయితీ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని, వారి ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొన్నాయి.
దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షలో పెద్దఎత్తున అక్రమాలు, ఉల్లంఘనలు జరిగినట్టు ఆధారాలు లేవని ఈ సందర్భంగా అఫిడవిట్లలో పేర్కొన్నాయి. వివిధ రాష్ర్టాల్లో నమోదైన కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తున్నదని తెలిపాయి. నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు జరిగాయని, పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈనెల 8న విచారణ చేపట్టనున్నది.
ఏండ్ల పాటు కష్టించి, నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర విద్యా శాఖ తన అఫిడవిట్లో తెలిపింది. నిరూపితమైన వాస్తవాల ఆధారంగా నిజమైన ఆందోళనను తప్పనిసరిగా పరిష్కరించాలని, ఇదే సమయంలో వాస్తవాలు లేకుండా కేవలం ఊహాగానాలు, అనుమానాల ఆధారంగా చేసే ఇతర అభ్యర్థనలను తిరస్కరించాలని పేర్కొన్నది. నిజాయతీ అభ్యర్థులు, వారి తల్లిదండ్రులకు అనవసరమైన ఇబ్బందులు, వ్యథ కలుగజేయకూడదని అభిప్రాయపడింది. పరీక్ష ప్రక్రియను సమర్థంగా నిర్వహించేలా తీసుకోవాల్సిన తగిన చర్యలు, సంస్కరణలపై సిఫారసు చేసేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించామని కోర్టుకు తెలిపింది.
మరోవైపు వేరుగా అఫిడవిట్ దాఖలు చేసిన ఎన్టీఏ.. కేంద్ర ప్రభుత్వ వాదననే పునరుద్ఘాటించింది. పరీక్షను రద్దు చేస్తే విద్యార్థుల ప్రయోజనాలకు నష్టమని, క్వాలిఫై అయిన విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని పేర్కొన్నది. నీట్ యూజీ-2024 పరీక్షను ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించామని కోర్టుకు తెలిపింది. పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను ఎన్టీఏ ఈ సందర్భంగా ఖండించింది. ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, తప్పుదోవ పట్టించేవని పేర్కొన్నది.