NEET-UG 2024 | ఎంబీబీఎస్ సహా వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించిన ‘నీట్-యూజీ 2024’లో జరిగిన కుంభకోణాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ), విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ద్వారా కప్పిపుచ్చే ప్రయత్నాలను కేంద్రం ప్రారంభించిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. సుప్రీంకర్టు పర్యవేక్షణలో జరుగుతున్న ఫోరెన్సిక్ విచారణే లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడుతుందన్నారు. నీట్ పేపర్ లీక్ కాకపోతే, బీహార్‌లో పేపర్ లీక్ పేరుతో 13 మందిని ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. కోచింగ్ సెంటర్ యజమాని, పరీక్షా కేంద్రం నిర్వాహకులు కుమ్మక్కు కావడం వల్లే నీట్ పరీక్షా పత్రం లీకైందని, డబ్బులు ముట్టాయని ఖర్గే పేర్కొన్నారు. గుజరాత్ లోని గోధ్రాలో చీటింగ్ రాకెట్ గుట్టు రట్టు కాలేదా? అని నిలదీశారు. ఎన్టీఏను దుర్వినియోగం చేసిన కేంద్రం దేశంలోని 24 లక్షల మంది యువత ఆకాంక్షలను తుంగలో తొక్కిందన్నారు. నీట్ యూజీ-2024 కుంభకోణంలో మార్కులు, ర్యాంకులు భారీగా రిగ్గింగ్ చేయడం వల్ల రిజర్వుడ్ సీట్ల కటాఫ్ కూడా పెరిగిందని చెప్పారు. ప్రతిభావంతులైన విద్యార్థులకూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు రాకుండా చేసేందుకే కేంద్రం ఈ ఆటలాడినట్లు కనిపిస్తోందన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్‌ను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దీనిపై విచారణ జరుపాలన్న డిమాండ్ ను పట్టించుకోక పోవడం బాధ్యతా రాహిత్యం అని వ్యాఖ్యానించింది.