NEET re exam : నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తూ, విద్యార్థుల భవిష్యత్ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ విషయంలో బాధ్యతతో వ్యవహరించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ర్యాలీ వల్ల ట్రాఫిక్‌లో ఇరుక్కుని ముగ్గురు విద్యార్థినులు నీట్ పరీక్ష రాయలేకపోయారు. రెండు నిమిషాలు ఆలస్యం కావడంతో వారిని పరీక్షకు అనుతించలేదు. దీంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ ఘటన ఆదివారం కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది.
బెంగళూరులోని ఆర్సీ గవర్నమెంట్ కాలేజీలో ఆదివారం నీట్ పరీక్ష జరిగింది. ఈ పరీక్ష కోసం ముగ్గురు అభ్యర్థులు వెళ్తుండగా బెంగళూరు నగరంలో ట్రాఫిక్ జామ్ తలెత్తింది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ నిర్వహించిన ఒక ర్యాలీ కారణంగా విద్యార్థులు ప్రయాణిస్తున్న మార్గంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం వల్ల ముగ్గురు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకోలేకపోయారు. రెండు నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నారు. పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులకు 1.30 గంటలలోపే అనుమతి ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. ఆర్సీ గవర్నమెంట్ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రం వద్ద 1.29 గంటలకే చివరి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత సరిగ్గా 1.30 గంటలకు మెయిన్ గేట్ క్లోజ్ చేశారు. అయితే, 1.32 నిమిషాలకు ముగ్గురు విద్యార్థినులు పరీక్షా కేంద్రం వద్దకు చేరుకున్నారు. అప్పటికే గేట్లు క్లోజ్ చేసి ఉండటంతో వేరే గేట్ పైనుంచి దూకి లోపలికి వెళ్లారు.
Bengaluru, Karnataka: A parent of one of the students says, “… Everyone across India knows that today, on the 21st, the NEET re-examination is being conducted. Yet the Congress has organized a rally here at the Palace Grounds. The roads have been blocked here for the last… https://t.co/1ixZBqPcRc pic.twitter.com/khChDcabht
— IANS (@ians_india) June 21, 2026
అయితే, నిబంధనల ప్రకారం లోపలి గేట్‌ను కూడా 1.30 గంటలకే మూసేశారు. ఒకసారి గేట్ మూసేసిన తర్వాత మళ్లీ తెరవడం సాధ్యం కాదని అధికారులు తెలిపారు. ఈ కారణంగా ఆ ముగ్గురు విద్యార్థినుల్ని అధికారులు పరీక్షకు అనుమతించలేదు. ఎంతబతిమిలాడినా లోపలికి వెళ్లనివ్వలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీ వల్ల తాము రెండు నిమిషాలు ఆలస్యంగా రావాల్సి వచ్చిందన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరోవైపు వివిధ కారణాల వల్ల దేశవ్యాప్తంగా అనేక చోట్ల విద్యార్థులు పరీక్షకు సమయానికి రాలేకపోయారు. దీంతో వారంతా పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు.