న్యూఢిల్లీ : నీట్ ప్రశ్నపత్రం లీకేజీ లక్షలాది విద్యార్థులపై ప్రభావం చూపింది. ఆ వివాదం పూర్తిగా సమసిపోకముందే ఇప్పుడు మరో కొత్త వివాదం మొదలైంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) గత నెల విడుదల చేసిన 12వ తరగతి ఫలితాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈ ఏడాది అమలు చేసిన ‘ఆన్ స్క్రీన్ మార్కింగ్'(ఓఎస్ఎమ్) విధానం సమర్థతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ ఏడాది సీబీఎస్ఈలో 85.2 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇది గత ఏడాది కంటే 3.19 శాతం తక్కువ. సీబీఎస్ఈ ఈ ఏడాది పాత పద్ధతిలో కాకుండా ఓఎస్ఎమ్ విధానంలో డిజిటల్ మూల్యాంకనం చేపట్టింది. ఇందులో భాగంగా సమాధాన పత్రాలను స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేశారు.
టీచర్లు వాటిని కంప్యూటర్ స్క్రీన్‌పై చెక్ చేసి మార్కులు డిజిటల్‌గా నమోదు చేశారు. మొత్తం మార్కులు కంప్యూటరే లెక్కపెట్టి చూపిస్తుంది. ఇలా మొత్తం 98,66,622 సమాధాన పత్రాలు మూల్యాంకనం చేశారు. ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేకమంది విద్యార్థులకు ఆశించిన దాని కంటే తక్కువ మార్కులు రావడం, కొన్ని సమాధానాలు మిస్ కావడం, ముఖ్యంగా ఫిజిక్స్, మ్యాథ్స్ వంటి సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడం వంటి సమస్యలకు కొత్త మూల్యాంకన విధానమే కారణమని మండిపడుతున్నారు. జేఈఈ వంటి పోటీ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి కూడా బోర్డు పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం, ఫెయిల్ కావడంతో షాక్‌కు గురయ్యారు. డిజిటల్ స్కానింగ్ ప్రక్రియలో మార్జిన్లలో రాసిన సమాధానాలు లేదా కొన్ని పేజీలు సరిగా స్కాన్ కాలేదని, దీని వల్ల నేరుగా మార్కులపై ప్రభావం పడిందని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
17 సంవత్సరాలుగా సీబీఎస్ఈ సమాధాన పత్రాలను మూల్యాంకనం చేస్తున్న ఉపాధ్యాయుడు సంజీవ్ మాట్లాడుతూ.. తక్కువ మార్కులు వచ్చాయని ఇంత భారీస్థాయిలో ఫిర్యాదులు రావడం ఇదే మొదటిసారని చెప్పారు. “ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానం గురించి ఉపాధ్యాయులు, ఎగ్జామినర్లకు మూల్యాంకనం ప్రారంభానికి కేవలం నెల ముందు మాత్రమే సమాచారం ఇచ్చారు. కాపీల చెకింగ్ ప్రారంభానికి కొద్దిసమయం ముందు మాకు ఆన్లైన్ శిక్షణ ఇచ్చారు. ఇంత పెద్ద వ్యవస్థను తొందరపాటుగా అమలు చేయకూడదు” అని సంజీవ్ అన్నారు. స్కానింగ్ సమయంలో ఏర్పడిన సాంకేతిక సమస్యలు కూడా మూల్యాంకనాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చని ఆయన తెలిపారు.
మూల్యాంకనంలో పొరపాట్లు జరిగాయని విద్యా శాఖ అధికారులు అంగీకరించారు. సుమారు 13 వేల ఆన్షర్ షీట్లలో పొరపాట్లు గుర్తించామని చెప్పారు. విద్యార్థులు తమ మార్కులపై సందేహాలుంటే ఈ నెల 19-22 మధ్య స్కాన్డ్ కాపీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఫలితాలపై ఆందోళనలు రేకెత్తుతుండడంతో సీబీఎస్ఈ సమాధాన పత్రాల రీవాల్యుయేషన్ చార్జీలను రూ.700 నుంచి రూ. 100కు తగ్గించింది. అంతేకాకుండా పరీక్షలు, ఫలితాలు, మూల్యాంకనంపై విద్యార్థుల ప్రశ్నలు, సందేహాలను తీర్చేందుకు టెలి కౌన్సెలింగ్ సపోర్ట్ హెల్ప్‌లైన్ 1800118004 ఏర్పాటు చేసింది.