Rahul Gandhi : నీట్ పేపర్ లీకేజీ ఘటనలో ప్రధాన బాధ్యుడిగా భావిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేయడం లేదా పదవి నుంచి తొలగించడం జరిగేంత వరకు తన పోరాటం ఆగబోదని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై ఆదివారం ఎక్స్ వేదికగా స్పందించారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు.
‘‘లక్షలాది మంది యువత వీధుల్లో ఉన్నప్పుడు.. 22 లక్షల మంది పిల్లల భవిష్యత్ ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టా సారించకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు, భవిష్యత్లో ఇలా నీట్ పేపర్ లీకేజీ అరికట్టేలా తగిన చర్యలు తీసుకునేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంది” అని రాహుల్ గాంధీ అన్నారు. నీట్ పేపర్ లీక్, రద్దు జరిగినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు చేస్తూనే ఉన్నారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
అయితే, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. దేశంలో అస్థిరత సృష్టించేందుకు, మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే రాహుల్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ విమర్శించింది. ప్రతిపక్షాలు, విదేశీ శక్తులు కలిసి రాహుల్ గాంధీ ద్వారా దేశంలో భారీ కుట్రకు తెరలేపాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. ఏడాదిలో ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారని చెప్పారు. దేశంలో అరాచకాన్ని వ్యాపింపజేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ప్రజలు వరుసగా బీజేపీకి మద్దతు తెలపడంతో కాంగ్రెస్ పార్టీ నిరాశలో ఉందన్నారు. రాహుల్, అతడి సన్నిహితులు దేశానికి వ్యతిరేకంగానే ఉంటారని మంత్రి విమర్శించారు. రాహుల్ గాంధీని, ప్రతిపక్షాల్ని ఆయన టూల్ కిట్ గ్యాంగ్గా వర్ణించారు.