చెన్నై: జాతీయ స్థాయి మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నీట్.. తమిళనాడుకు చెందిన ఓ కుటుంబంలో విషాదం నింపింది. నీట్లో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడగా, కుమారుడి మరణాన్ని తట్టుకోలేని విద్యార్థి తండ్రి కూడా ప్రాణాలు తీసుకొన్నాడు. నీట్లో క్వాలిఫై కాలేకపోవడంతో జగదీశ్వరన్ అనే విద్యార్థి ఈనెల 12న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడి బలవన్మరణానికి ‘నీట్’ కారణమని పేర్కొన్న తండ్రి సెల్వశేఖర్ సోమవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం విషాదంగా మారింది. విద్యార్థి, తండ్రి ఆత్మహత్యలపై స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గవర్నర్ తేనీటి విందు బహిష్కరణ
నీట్‌పై గవర్నర్ వ్యాఖ్యలకు నిరసనగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఇచ్చే తేనీటి విందు కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు సీఎం స్టాలిన్ వెల్లడించారు. కాగా, నీట్ వ్యతిరేక బిల్లుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలుపాలని కోరుతూ రాష్ట్రపతి ముర్ముకు స్టాలిన్ సోమవారం లేఖ రాశారు.