Rajasthan | ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల ఆత్మహత్య (Prevent Suicides)లు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా గత కొంతకాలంగా విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వసతి గృహాల్లోని ఫ్యాన్లకు ఉరివేసుకోవడం, విషం తాగడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
బీహార్ రాష్ట్రం నలంద జిల్లాకు చెందిన హర్షరాజ్ శంకర్ (17) మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కోచింగ్ కోసం కోటాకు వచ్చారు. అక్కడ జవహర్ నగర్‌లోని హాస్టల్లో ఉంటూ గతేడాది ఏప్రిల్ నుంచి కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం అతను తన హాస్టల్ రూమ్‌లో ఐరన్‌రాడ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హాస్టళ్లు, పీజీల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేసిన కారణంగా ఐరన్ రాడ్‌కు ఉరేసుకున్నట్లు పేర్కొన్నారు.
అతడి రూమ్‌లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విద్యార్థి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. కాగా, తాజా ఘటనతో ఈ ఏడాది కోటాలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం ఇది తొమ్మిదో ఘటన కావడం గమనార్హం. ఇక గతేడాదిన 17 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడగా.. అంతకు ముందు ఏడాది అంటే 2023లో ఏకంగా 30 మంది దాకా విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు.
వరుస ఆత్మహత్యల కారణంగా కోటాకు వచ్చే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. చాలా హాస్టళ్లు ఖాళీ అవుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరానికి కోటా హాస్టళ్లకు వచ్చే విద్యార్థుల సంఖ్య 2 లక్షల నుంచి 1.24 లక్షలకు పడిపోయింది. ప్రస్తుతం 40 శాతం కంటే తక్కవు ఆక్యుపెన్సీ ఉంది. దీని కారణంగా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో 2025-26 అకాడమిక్ ఇయర్‌ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల ఆత్మహత్యలు నివారించేందుకు కోటా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ‘కోటా కేర్స్’ ప్రచారం కింద కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లకు కోటా జిల్లా యంత్రాంగం సరికొత్త మార్గదర్శకాలను (New rules) విడుదల చేసింది. కోటా కేర్స్ క్యాంపెయిన్‌లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా హాస్టల్ గదుల్లో స్ప్రింగ్ తరహా సీలింగ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండేలా వసతి గృహాల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తామన్నారు.
Also Read..
Yogi Adityanath | యూపీలో ముస్లింలు అత్యంత సురక్షితంగా ఉన్నారు : యోగి ఆదిత్యనాథ్