Kunal Kamra | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde)ని లక్ష్యంగా చేసుకుని స్టాండప్ కమెడియన్ (stand-up comedian) కునాల్ కమ్రా (Kunal Kamra) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కమ్రాకు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. అయినప్పటికీ ఆయన తీరులో మార్పు రాలేదు. ఆయన తాజాగా మరో పేరడీ వీడియో రిలీజ్ చేశారు. ఈసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ను ఉద్దేశిస్తూ పాట పాడారు. ‘మిస్టర్ ఇండియా’ సినిమాలోని ‘హవా హవాయి..’ పాటను పేరడీ చేశారు. పన్ను చెల్లింపుదారుల సొమ్ము వృథా అవుతోందంటూ అందులో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
కాగా, మరోవైపు షిండేపై వివాదాస్పద వ్యాఖ్యలకు గానూ ముంబై పోలీసులు కమ్రాకు మరోసారి నోటీసులు పంపారు. అధికారుల ముందు హాజరయ్యేందుకు వారం రోజులు గడువు ఇవ్వాలంటే కమెడియన్ చేసిన విజ్ఞప్తిని పోలీసులు నిరాకరించారు. దీంతో ఇవాళ ఆయనకు రెండోసారి నోటీసులు జారీ చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 35 కింద ఈ నోటీసులు జారీ చేశారు.
షిండేపై కమెడియన్ కునాల్ వ్యాఖ్యలు
ముంబైలోని ఖార్ ప్రాంతంలోని ది హాబిటాట్ కామెడీ క్లబ్బులో జరిగిన కార్యక్రమంలో కునాల్ కమ్రా దిల్‌తో పాగల్ హై పాటను రాజకీయ పేరడీ చేసి పాడారు. ఇందులో షిండే ను ఉద్దేశించి ద్వంద్వ అర్థం వచ్చేలా పాడారు. ఈ సందర్భంగా షిండేను ఉద్దేశించి దేశద్రోహి అంటూ అభివర్ణించాడు. ఇది షిండే అభిమానులకు కోపం తెప్పించింది. కునాల్‌కు వ్యతిరేకంగా క్లబ్‌పై శివసేన కార్యకర్తలు దాడి చేసి, ధ్వంసం చేశారు. తక్షణమే కునాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కునాల్ కమ్రా వ్యాఖ్యలు దుమారం రేగడంతో శివసేన యువసేన ప్రధాన కార్యదర్శి రాహుల్ కనాల్ .. కునాల్ కమ్రా సహా రాహుల్ గాంధీ, ఆదిత్య ఠాక్రేలపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ముగ్గురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముందస్తు ప్రణాళికతోనే షిండేపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. కునాల్ క్షమాపణ చెప్పాలని సీఎం ఫడ్నవీస్ సైతం డిమాండ్ చేశారు. అయితే, తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పనని కునాల్ కమ్రా ఇప్పటికే స్పష్టం చేశారు.
Also Read..
“Eknath Shinde | కమ్రా సుపారి తీసుకున్నట్లుంది.. కమెడియన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏక్నాథ్ షిండే”
“షిండేపై కమెడియన్ కునాల్ వ్యాఖ్యల దుమారం”