Dense Fog | ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) సహా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, బీహార్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చలి పెరగడంతో ఆయా ప్రాంతాలను దట్టమైన పొగమంచు (Dense Fog) కమ్మేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఢిల్లీ – ఎన్సీఆర్ (Delhi-NCR) ప్రాంతాల్లో దృశ్యమానత అధ్వానస్థితికి చేరింది. పలు ఏరియాల్లో విజిబిలిటీ (visibility) జీరోకు పడిపోయింది. రోడ్డుపై ముందు వెళ్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి. పొగమంచు కారణంగా ఢిల్లీలో విమాన, రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది (flights delayed).
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం 6 గంటలకు విజిబిలిటీ 100 మీటర్లుగా నమోదైంది. దీంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు రాకపోకలు సాగించే దాదాపు 200కిపైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని విమానాలను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు. విమాన సర్వీసులు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా సహా పలు విమాన సంస్థలు తమ ప్రయాణికులకు ముందుగానే పలు సూచనలు చేశారు.
పొగమంచు కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని.. ఫ్లైట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించాయి. మరోవైపు దట్టమైన పొగమంచు కారణంగా కనీసం 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. బుధవారం ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇదిలా ఉండగా.. బుధవారం ఉదయం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా పేలవమైన కేటగిరీలో నమోదైంది. 8 గంటల సమయంలో ఢిల్లీలో ఏక్యూఐ లెవల్స్ 332గా నమోదయ్యాయి.
Also Read..
Warships | నేడు మూడు యుద్ధనౌకలను జాతికి అంకితమివ్వనున్న ప్రధాని మోదీ
Makara Jyothi | సంక్రాంతి పర్వదినాన శబరిమలలో దర్శనమిచ్చిన మకరజ్యోతి