ఇంఫాల్: మణిపూర్‌లోని కొండ, లోయ ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా ఆయుధాలు అప్పగించాలన్న గవర్నర్ అజయ్ కుమార్ భల్లా పిలుపునకు వారు స్పందిస్తున్నారు. దోచుకున్న, చట్టవిరుద్ధంగా కలిగిన ఆయుధాలను ప్రజలు పెద్ద సంఖ్యలో సరెండర్ చేస్తున్నారు. (Firearms Surrendered) ఫిబ్రవరి 25 నాటికి 12 సీఎంజీ గన్స్, .303 రైఫిల్స్ 2, 2 ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, 4 ఎస్బీబీఎల్ రైఫిల్స్, .303 రైఫిల్స్ మ్యాగజైన్లు 2, సీఎంజీ గన్ మ్యాగజైన్లు 12, ఎస్ఎల్ఆర్ రైఫిల్స్ మ్యాగజైన్లు 2, ఒక ఐఈడీ, .303 రైఫిల్స్‌కు సంబంధించిన 33 లైవ్ రౌండ్లు, ఎస్ఎల్ఆర్ రైఫిల్స్‌కు సంబంధించిన 32 లైవ్ రౌండ్లు, ఎస్బీబీఎల్ రైఫిల్స్‌కు సంబంధించిన 5 లైవ్ రౌండ్లను ప్రజలు అప్పగించారు. ఇంఫాల్‌లోని భద్రతా దళాలు వీటిని మీడియా ముందు ప్రదర్శించారు.
కాగా, మణిపూర్‌లో ఏడాదిన్నరకుపైగా మైతీ, కుకీ జాతుల మధ్య ఘర్షణలు జరిగాయి. వందలాది మంది మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. చివరకు ఫిబ్రవరి 9న సీఎం బిరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. అక్కడి పరిస్థితుల దృష్ట్యా ఫిబ్రవరి 13న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను కేంద్రం విధించింది.
మరోవైపు ఫిబ్రవరి 20న గవర్నర్ అజయ్ కుమార్ భల్లా కీలక ప్రకటన చేశారు. లూఠీ చేసిన, చట్టవిరుద్ధంగా కలిగిన ఆయుధాలను వారం రోజుల్లో ప్రజలు స్వచ్ఛందంగా అప్పగించాలని పిలుపునిచ్చారు. ఆయుధాలు సరెండర్ చేసిన వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు ఉండవని హామీ ఇచ్చారు. గడువు తర్వాత ఆయుధాలు కలిగి ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.