పుదుచ్చేరి, మార్చి 20 : కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. సీఎం రంగస్వామి నేతృత్వంలో రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలతో మరోసారి అధికారం చేపట్టాలని ఏఐఎన్ఆర్సీ బీజేపీ కూటమి ఆశిస్తున్నది. విపక్ష కాంగ్రెస్ కూటమి ఈసారి గెలుపుపై గట్టి ఆశలే పెట్టుకుంది. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపాయి. ఈ ఎన్నికల్లో రెండు కూటములే ప్రధానంగా ముఖాముఖీ తలపడనున్నాయి. సీఎం రంగస్వామి రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అతని క్లీన్ ఇమేజ్ అధికార పార్టీకి బలం కానున్నాయి. రాష్ట్రంలో అవినీతి, శాంతి భద్రతల వైఫల్యం, నకిలీ మందుల తయారీ వెనుక బడా రాజకీయ నేతల ప్రమేయం ఉండటం ఆ కూటమిని ఇబ్బంది పెడుతున్నాయి. వాస్తవానికి పుదుచ్చేరి ఒక ప్రాంతంలో లేదు. పుదుచ్చేరి, కారైకల్ (తమిళనాడు), మహే (కేరళ), యానాం (ఏపీ)లను కలిసి పుదుచ్చేరిగా వ్యవహరిస్తుంటారు. ఇవి వేర్వేరు రాష్ర్టాల్లో విస్తరించి ఉన్నాయి. పుదుచ్చేరికి అసెంబ్లీ, ముఖ్యమంత్రి ఉన్నా రాష్ట్రంలా పూర్తి అధికారాలు ఉండవు. రాష్ట్రపతి నేతృత్వంలో ఎల్జీకే ఎక్కువగా అధికారాలు ఉంటాయి.
నిధుల కోసం ప్రధానంగా కేంద్రంపైనే ఆధారపడాల్సి ఉంటుంది. మంత్రివర్గంలో ఉన్న ఏకైక మహిళా మంత్రి చందిర ప్రియజ్ఞను తొలగించడంతో ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.ఎన్నికైన ప్రభుత్వానికి పూర్తి అధికారాలు లేకపోవడం, ప్రతిదానికి కేంద్రాన్ని దేబరించాల్సి రావడం రంగస్వామి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.
కాంగ్రెస్కు రాష్ట్రంలో విస్తృతమైన సంస్థాగత ఉనికి ఉంది. ఇక డీఎంకే రాష్ట్రంలో తన నెట్వర్క్ను విస్తృతంగా పెంచుకుంది. అయితే కూటమికి ఎవరు నాయకత్వం వహించాలి, గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి అన్న విషయంలో రెండు పార్టీలు ఒక నిర్ణయానికి రాలేకపోయాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు ఈసారి అధికారాన్ని తెచ్చిపెడుతుందని ఈ కూటమి భావిస్తున్నది.
అధికార ఎన్డీఏ కూటమిలో సీట్ల కేటాయింపుపై శుక్రవారం పార్టీల మధ్య పొత్తు కుదిరింది. 30 సీట్లున్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి నేతృత్వంలోని ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ)కి 16, బీజేపీకి 10 సీట్లు కేటాయించారు.