న్యూఢిల్లీ, జనవరి 30: బారామతిలో బుధవారం విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత అజిత్ పవార్ స్థానంలో ఆయన భార్య సునేత్ర పవార్ శనివారం నూతన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆమె పేరును ఖరారు చేసేందుకు ఎన్సీపీ శాసనసభా పక్షం శనివారం ముంబైలోని విధాన్ భవన్లో సమావేశం కానున్నది. దీని తర్వాత సాయంత్రం సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. సునేత్ర పవార్ రాష్ట్రంలో తొలి మహిళా ఉప ముఖ్యమంత్రి కానున్నారు.
తన భర్త మరణంతో ఖాళీ అయిన పదవిని సునేత్ర భర్తీ చేయనున్నట్లు మహారాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్‌బల్ సూచించిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఉప ముఖ్యమంత్రి బాధ్యతను సునేత్రకు అప్పగించాలని చాలామంది కోరుతున్నారని, వారి డిమాండు అసమంజసంగా తనకు కనపడడం లేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పదవిని సునేత్ర పవార్‌తో భర్తీ చేయాలని, తమ ఆలోచన అదేనని భుజ్‌బల్ చెప్పారు. రేపటి సమావేశం ప్రాథమికంగా శాసనసభా పక్ష లీడర్ని ఎన్నుకుంటుందని ఆయన చెప్పారు.
సునేత్ర పవార్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. మహారాష్ట్ర శాసనసభ లేదా మండలిలో ఆమెకు సభ్యత్వం లేదు. అయితే అజిత్ పవార్ మృతితో పుణె జిల్లాలోని బారామతి అసెంబ్లీ స్థానానికి ఖాళీ ఏర్పడింది. కాగా, ఎన్సీపీ శాసనసభా పక్ష నాయకురాలిగా సునేత్ర పవార్ ఎన్నికయ్యేందుకు ఎవరి నుంచి ఎటువంటి వ్యతిరేకత లేదని అంతకుముందు ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ విలేకరులకు తెలిపారు.