ముంబై : యూపీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీకి రాజీనామా చేసి సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరిన అనంతరం కాషాయ పార్టీపై ఎన్సీపీ నేత శరద్ పవార్ మరో బాంబు పేల్చారు. యూపీలో మరో 13 మంది ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరతారని పవార్ మంగళవారం వ్యాఖ్యానించారు. యూపీ ప్రజలు మార్పు కోరుతున్నారని, ఎస్పీతో పాటు పలు చిన్న పార్టీలతో కలిసి తాము ఈ మార్పునకు దోహదపడతామని ఆయన పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు యూపీలో మతపరమైన విభజన తీసుకువస్తున్నారని, రాష్ట్ర ప్రజలు దీనికి దీటైన సమాధానం ఇస్తారని పవార్ చెప్పారు. యూపీలో ఎస్పీతో కలిసి పోటీ చేస్తున్న ఎన్సీపీ గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఎంసీతో కలిసి కూటమిగా ఏర్పడేందుకు కసరత్తు సాగిస్తున్నామని తెలిపారు. ఇక యూపీలో మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య రాష్ట్ర క్యాబినెట్ నుంచి వైదొలగి కాషాయ పార్టీని వీడి ఎస్పీలో చేరడం కలకలం రేపింది.
ఆయనతో పాటు మరో ముగ్గరు బీజేపీ ఎమ్మెల్యేలు అఖిలేష్ పార్టీలో చేరారు. యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని బీజేపీ సర్కార్ దళితులు, రైతులు, నిరుద్యోగులు, చిన్న వ్యాపారులను నిర్లక్ష్యం చేస్తున్నందునే తాను ఆ పార్టీని వీడానని స్వామి ప్రసాద్ మౌర్య తెలిపారు. ఇక ఫిబ్రవరి 7 నుంచి ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.