Babri Masjid | న్యూఢిల్లీ: ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న 12వ తరగతి పొలిటికల్ సైన్స్ కొత్త ఎడిషన్ పాఠ్యపుస్తకంలో ఎన్సీఈఆర్టీ పలు మార్పులు చేసింది. ‘బాబ్రీ మసీదు’ అనే పదాన్ని పూర్తిగా తొలగించి దాన్ని ‘మూడు గుమ్మటాల నిర్మాణం’ (త్రీ-డోమ్డ్ స్ట్రక్చర్)గా సంబోధించడం ఈ మార్పుల్లో ప్రధానమైనది. అలాగే రాముడి రథయాత్ర, రామ జన్మభూమి ఉద్యమంలో కరసేవకుల పాత్ర, బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం చెలరేగిన హింస, రాష్ట్రపతి పాలనను విధించడం తదితర అంశాలతో అయోధ్య చాప్టర్లో ఉన్న కంటెంట్‌ను నాలుగు పేజీల నుంచి రెండు పేజీలకు కుదించింది.
అల్లర్ల గురించి ఎందుకు బోధించాలి?
విద్యలో ద్వేషం, హింస పాఠ్యాంశాలుగా ఉండకూడదని, వాటిపై విద్యార్థులు దృష్టి సారించకూడదని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీ అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు బోధించే అంశాలను కాషాయీకరిస్తున్నారన్న ఆరోపణలను తోసిపుచ్చారు. సానుకూల ఆలోచనలతో కూడిన పౌరులను తయారు చేయాలనుకొంటున్నామని, హింసాత్మక ప్రవృత్తితో కూడిన వ్యక్తులను కాదని స్పష్టం చేశారు.