HMPV | హ్యుమన్ మెటాప్న్యూమో వైరస్ చైనాను వణికిస్తున్నది. గత ఐదేళ్ల కిందట వచ్చిన కొవిడ్ తరహాలోనే కొత్త వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నది. దాంతో పెద్ద ఎత్తున జనం ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ క్రమంలో భారత్ అప్రమత్తమైంది. వైరస్‌పై దృష్టి పెట్టాలని ఎన్సీడీసీని కేంద్రం ఆదేశించింది. శ్వాసకోశ లక్షణాలు, ఇతర ఫ్లూ కేసులను పరిశీలించాలని సూచించింది. ఈ మేరకు అంతర్జాతీయ హెల్త్ ఏజెన్సీలతో భారత్ సంప్రదింపులు జరుపుతున్నది. అయితే, చైనా కొత్త వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్సీడీసీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం మన దేశంలో అలాంటి వైరస్ జాడ లేదని స్పష్టం చేశారు.
అయితే, వైరస్ గురించి భయపడాల్సిందేమీ లేదని.. ఇతర శ్వాసకోశ వైరస్ల తరహాలోనే ఉంటుంది డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ గోయెల్ తెలిపారు. చలికాలంలో శ్వాసకోశ వ్యాధులు సర్వసాధారణమని, వాటిని ఎదుర్కోవడానికి భారతదేశంలోని ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వాటి కోసం ప్రత్యేకంగా మందులు అవసరం లేదని.. దానికి యాంటీ వైరల్ మందులు లేవన్నారు. ఆసుపత్రులు, ఐసీఎంఆర్ డేటా మేరకు భారీ కేసులు లేవని.. ఆందోళన చెందాల్సిన పని లేదని గోయల్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) దేశంలోని శ్వాసకోశ వ్యాధులతో పాటు కాలానుగుణంగా వచ్చే ఇన్ఫ్లుయెంజా కేసులను నిశితంగా పరిశీలిస్తుందని తెలిపారు.
అయితే, చైనాలో విస్తరిస్తున్న హ్యుమన్ మెటాప్న్యూమో వైరస్‌లో కొవిడ్ తరహా లక్షణాలు కనిపిస్తున్నాయని సమాచారం. దగ్గు, జ్వరం, నాసికారంధ్రాలు మూసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తదితర లక్షణాలు వైరస్ సోకిన వారిలో కనిపిస్తున్నట్లుగా పలు నివేదికలో పేర్కొన్నాయి. వైరస్ తీవ్రమైతే బ్రోన్కైటిస్, న్యుమోనియా తదితర సమస్యలకు దారితీస్తుంది. మూడు నుంచి ఆరురోజుల వరకూ లక్షణాలు ఉంటాయని.. ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి లక్షణాలు మారుతుంటాయని తెలిపాయి. కరోనా తరహాలోనే ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ తేలిగ్గానే సోకుతుందని.. చిన్న పిల్లలు, వృద్ధులతో పాటు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని నివేదికలు తెలిపాయి.