Farooq Abdullah | శ్రీనగర్, నవంబర్ 2 : జమ్ము కశ్మీర్లో వరుస ఉగ్రవాద ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు పట్టుబడితే చంపొద్దని, ప్రాణాలతో పట్టుకుని లోతుగా విచారించాలని అన్నారు. సరిహద్దులో ఉగ్రవాదుల నెట్వర్క్, సూత్రధారుల గురించి తెలుసుకోవాలని చెప్పారు. ఇటీవల జరిగిన బుద్గామ్ ఉగ్రవాద దాడిపై లోతైన విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జమ్మూ కశ్మీర్లోని ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కొందరు ఈ దాడి చేయించినట్టుగా అనుమానం ఉందన్నారు. ఉగ్రవాదుల్ని చంపకూడదని, పట్టుకుని విచారిస్తే సీఎం ఒమర్ సర్కారును అస్థిరపర్చేందుకు ఏదైనా సంస్థ ప్రయత్నం చేస్తున్నదా అనే విషయం తేలుతుందని అభిప్రాయపడ్డారు. బుద్గామ్ ఘటనలోనూ పాక్ పాత్ర ఉండొచ్చు కదా అని విలేకరులు ప్రశ్నించగా ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ ఘటనపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది అన్నారు.
ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి. అబ్దుల్లా వ్యాఖ్యలను ఎన్సీపీ(ఎస్పీ) వర్గం అధ్యక్షుడు శరద్ పవార్ స్వాగతించారు. ‘ఫరూక్ అబ్దుల్లా చాలా సీనియర్ నేత. ఆయన చిత్తశుద్ధి, నిజాయతీ పట్ల నాకు ఎలాంటి సందేహం లేదు. అలాంటి నేత చేసిన వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం, హోంశాఖ తీవ్రంగా పరిగణించి, సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించాలి.’ అని అన్నారు.
ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలను బీజేపీ జమ్మూ కశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనా తప్పుబట్టారు. ఉగ్రవాదం పాకిస్థాన్ నుంచి వస్తున్నదనే విషయం ఫరూక్ అబ్దుల్లాకు తెలుసు. ఇది అందరికీ తెలిసిన నిజం. ఇందులో దర్యాప్తు జరపాల్సిన అవసరం ఏముంది? మానవత్వానికి శత్రువులైన వారితో మనమంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది అని రవీందర్ రైనా సూచించారు.