Nayab Singh Saini : కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు రెండూ అవినీతి పార్టీలని హరియాణ సీఎం నయాబ్ సింగ్ సైనీ ఆరోపించారు. హరియాణ ప్రజల సంక్షేమం కోసం ఈ పార్టీలు పనిచేయవని, అవినీతితో తమ జేబులు నింపుకోవడమే ఈ పార్టీల అజెండా అని విమర్శించారు. అథ్లెట్లు, యువత, రైతులు, పేదల పేరుతో రాజకీయాలు చేసే కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ వారి అభ్యున్నతికి పాటుపడలేదని దుయ్యబట్టారు.
ఆయా వర్గాలను మోసగించడమే కాంగ్రెస్ విధానమని మండిపడ్డారు. హరియాణ ప్రజలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. భారీ మెజారిటీతో కాషాయ పార్టీ హరియాణలో మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాష్ట్ర పురోభివృద్ధికి పాటుపడిందని చెప్పారు.
2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మలచాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా నిర్ధేశించుకున్నారని, ఈ ఆశయానికి హరియాణ ప్రజలు వెన్నుదన్నుగా నిలిచి మద్దతు ఇస్తారనే విశ్వాసం తనకున్నదని చెప్పారు. ప్రధాని మోదీ కలను సాకారం చేసేందుకు కాషాయ శ్రేణులు శ్రమిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, ఆప్‌లకు హరియాణ అభివృద్ధి పట్టదని, తమ సొంత ప్రయోజనాలకే ఆ పార్టీ నేతలు ప్రాధాన్యత ఇస్తారని హరియాణ సీఎం నయాబ్ సింగ్ సైనీ ఆరోపించారు.
Read More :
MLA Suspension | టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెన్షన్