బీజాపూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో పోలీసు ఇన్ఫార్మర్ అనే నెపంతో35 ఏళ్ల బీజేపీ కార్యకర్తను నక్సలైట్లు హతమార్చినట్లు అధికారి ఒకరు బుధవారం తెలిపారు. గడచిన వారం రోజుల్లో బీజాపూర్ జిల్లాలో ఐదుగురు పౌరులను నక్సలైట్లు హత్య చేశారు. ఫర్సేగఢ్ పోలీసు స్టేషన్ పరిధిలోని సోమన్‌పల్లి గ్రామంలో తన ఇంట్లో ఉన్న కుడియంమాదో అనే బీజేపీ కార్యకర్తను నక్సలైట్లు చంపివేశారు. ఇంట్లో నుంచి బయటకు ఈడ్చుకొచ్చిన నక్సలైట్లు మాదోను గొంతు నులిమి హతమార్చినట్లు ఆ అధికారి చెప్పారు. ఈ హత్యను తామే చేసినట్లు మావోయిస్టు నేషనల్ పార్క్ కమిటీ అక్కడ విడిచిపెట్టిన ఒక కరపత్రంలో తెలిపింది. పోలీసు ఇన్ఫార్మన్గా పనిచేస్తున్నందుకే తాము మాదోను చంపామని వారు పేర్కొన్నారు. మంగళవారం ఘటనతో కలుపుకుని బస్తర్ డివిజన్లో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 60 మంది పౌరులు నక్సల్స్ చేతిలో మరణించారు.