Tarakka | మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ భార్య విమల చంద్ర సిదాం అలియాస్ తారక్క.. మహారాష్ట్ర సీఎం ఎదుట బుధవారం లొంగిపోయారు. ప్రస్తుతం ఆమె మావోయిస్ట్ పార్టీ స్పెషల్ జోనరల్ కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మల్లోజుల కోటేశ్వర్ రావు, మల్లోజుల వేణుగోపాల్ అన్నదమ్ములు కాగా.. కోటేశ్వర్ రావు అలియాస్ కిషన్ జీ మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పని చేశారు. ఆయన పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వేణుగోపాల్ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. తారక్క అలియాస్ విమల 1983లో పీపుల్స్ వార్లో చేరారు. ప్రస్తుతం ఆమెపై నాలుగు రాష్ట్రాల్లో 170కిపైగా కేసులు నమోదైనట్లుగా పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఆమె తలపై రూ.కోటి వరకు రివార్డు ఉన్నది.
గడ్చిరోలిలో జరిగిన కార్యక్రమంలో తారక్క మరో 11 మంది మావోలతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా రూ.1.03కోట్ల రివార్డును సీఎం అందజేశారు. ఈ సందర్భంగా నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన సీ-60 కమాండోలు, అధికారులను సైతం సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టులు ఇటీవల లొంగుబాటు నేపషథ్యంలో త్వరలోనే మహారాష్ట్ర నక్సల్స్ నుంచి విముక్తి పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గడ్చిరోలి జిల్లాలో నక్సల్స్ కార్యకలాపాలను పోలీసులు దాదాపుగా నిర్మూలించారన్నారు. ఉత్తర గడ్చిరోలి ప్రస్తుతం మావోయిస్టు కార్యకలాపాలకు దూరంగా ఉందని.. దక్షిణ గడ్చిరోలి త్వరలో నక్సల్స్ నుండి విముక్తి పొందుతుందన్నారు. గత సంవత్సరాల్లో చాలా మంది భయంకరమైన నక్సల్స్ను నిర్మూలించడంతో పాటు అరెస్టు చేసినట్లు సీఎం పేర్కొన్నారు. మావోయిస్టుల బూటకపు ఎన్కౌంటర్లను గ్రహించి.. నక్సల్స్ ఉద్యమానికి దూరమవుతున్నారన్నారు. రాజ్యాంగ సంస్థల ద్వారానే తమకు న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నారన్నారు.