Navya Haridas | వయనాడ్, అక్టోబర్ 20: వయనాడ్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రాకు పోటీగా తమ పార్టీ కేరళ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ నవ్య హరిదాస్(36)ను బీజేపీ బరిలోకి దింపింది. శనివారం ఆమెను అభ్యర్థిగా ప్రకటించింది. బీటెక్ చదివిన నవ్య కోజికోడ్ కార్పొరేషన్ నుంచి రెండుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. కోజికోడ్ కార్పొరేషన్ బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా వ్యవహరిస్తున్నారు. నవ్య 2021లో కోజికోడ్ దక్షిణ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఏడీఆర్ సంస్థ సమాచారం ప్రకారం ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. మరోవైపు ఎల్డీఎఫ్ కూటమి వయనాడ్ ఎంపీ అభ్యర్థిగా సీపీఐ సీనియర్ నేత సత్యన్ మోకెరిని ప్రకటించింది.