(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): నీట్-యూజీ పేపర్ లీకేజీ, పరీక్ష రద్దుపై దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతమవుతున్నాయి. ఓ ప్రవేశ పరీక్షను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని కేంద్ర ప్రభుత్వం ఉంటే ఎంత? పోతే ఎంత? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 2023లో తెలంగాణలో వెలుగుచూసిన గ్రూప్-1 పరీక్ష పత్రం లీక్ ఉదంతాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. నాడు లీక్ విషయం బయటకు రాగానే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన అప్పటి కేసీఆర్ ప్రభుత్వం మెరుపు వేగంతో దోషులను పట్టుకొంది. అయినప్పటికీ రాష్ట్ర బీజేపీ నేతలు గగ్గోలు పెట్టారు. అయితే ఇప్పుడు నీట్-యూజీ పరీక్ష పత్రం లీకవ్వడంతో ఏకంగా ఎగ్జామ్‌నే కేంద్రం రద్దు చేసింది. దీనిపై స్పందించాలంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాన్‌ను మీడియా ప్రశ్నిస్తే.. ఆయన ముఖం చాటేశారు. దీంతో అప్పుడు గగ్గోలు పెట్టిన రాష్ట్ర బీజేపీ నేతలు.. ఇప్పుడు నీట్ పరీక్ష పత్రం లీకేజీపై ఏం సమాధానం చెప్తారంటూ తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు.